Tapsee Pannu | తెలుగు సినిమాలతోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తాప్సీ.. ఇప్పుడు బాలీవుడ్లో సెటిల్ అయిపోయింది. అక్కడే వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తోంది. ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరుస్తోంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్‌తో ఆమె నటించిన డంకీ సినిమా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ తన లవ్, బ్రేకప్ స్టోరీని బయటపెట్టింది.
తాప్సీ తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో తొలిసారిగా ప్రేమలో పడిందట. హైస్కూల్లో తన సీనియర్, 10వ తరగతి స్టూడెంట్ను చూసి ఇష్టపడిందట. మొదట్లో తాప్సీని చూసి ఆ అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. కానీ చదువు పాడైపోతుందని భావించిన ఆ విద్యార్థి.. తాప్సీని దూరం పెట్టాడు. అంతేకాదు.. ఇలాంటివి వదిలేసి చదువుపై శ్రద్ధ పెట్టమని ఉచిత సలహా కూడా ఇచ్చాడంట. తాజాగా ఈ విషయాన్ని తాప్సీ బయటపెట్టింది. తాను ఇష్టపడ్డ అబ్బాయి అలా మాట్లాడటంతో చాలా బాధపడ్డానని తాప్సీ చెప్పింది. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా టైమ్ పట్టిందని తన బ్రేకప్ స్టోరీని వివరించింది.