Kiara Advani | బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీది సక్సెస్ఫుల్ జోడి. ఈ జంట గతంలో కలిసి నటించిన ‘భూల్ భులయ్యా 2’ ఘన విజయాన్ని సాధించింది. వీరు హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన కొత్త సినిమా ‘సత్యప్రేమ్‌కి కథ’. ఈ చిత్రాన్ని దర్శకుడు సమీర్ విద్వాన్స్ రూపొందిస్తున్నారు. ఈ నెల 29న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ ట్రైలర్‌కు ఫిదా అయ్యాడు కియారా భర్త హీరో సిద్ధార్థ్ ఆనంద్. ట్రైలర్ చాలా బాగుందని, వీలైనంత త్వరగా సినిమా చూడాలనే ఉత్సుకత కలుగుతున్నదని ప్రశంసించాడు. సిద్ధార్థ్ స్పందనపై సంతోషాన్ని వ్యక్తం చేసింది నాయిక కియారా అద్వానీ. ‘ట్రైలర్ విడుదల ముందు రోజు ఒత్తిడితో నిద్రపోలేదు. ఇప్పుడు వస్తున్న స్పందనతో సంతోషంతో నిద్రరావడం లేదు. మా చిత్ర ట్రైలర్ ఆయనకు నచ్చింది చాలు’ అని పేర్కొంది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందింది. కియారా ప్రస్తుతం రామ్‌చరణ్ సరసన ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్నది.