కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించనున్న 67వ చిత్రానికి ముహూర్తం కుదిరింది. ఈ నెల 5వ తేదీన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న రెండో చిత్రమిది. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘మాస్టర్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల కమల్‌హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ రూపొందించిన ‘విక్రమ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో దర్శకుడి ఫామ్, ఇమేజ్ కూడా విజయ్ సినిమా మీద క్రేజ్ పెంచుతున్నది.
ఈ సినిమాకు ప్రకటించిన స్టార్కాస్ట్ కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతున్నది. సంజయ్‌దత్, నివీన్ పాలి, అర్జున్ సర్జా, విశాల్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారట. ఇంత స్టార్‌కాస్ట్‌తో సినిమా చేయడం ఆసక్తిని కలిగిస్తున్నది. విజయ్ ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏండ్లవుతున్న సందర్భంగా ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. ఇక విజయ్ నటిస్తున్న కొత్త సినిమా ‘వరిసు’ తెలుగులో ‘వారసుడు’గా తెరపైకి రాబోతున్నది.