తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) నిర్వహించిన ‘టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2026’ ప్రదానోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. టీఎఫ్‌సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యూరీ ఛైర్మన్, నటి ఇంద్రజ విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. శ్రీనుగాడి సైకిల్ స్టోరీ, సైబర్ స్లేవరీ, మాతృదేవోభవ షార్ట్ ఫిల్మ్‌లు వరుసగా ఉత్తమ, ద్వితీయ, తృతీయ చిత్రాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్లయిన సందర్భంగా ఈ అవార్డులను అందజేశామని అన్నారు.
కేవలం 15రోజుల వ్యవధిలోనే ఈ కాంటెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించామని, 60కిపైగా ఎంట్రీలు వచ్చాయని, విజేతలకు ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మరింత భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, నగదు బహుమతుల్ని కూడా పెంచుతున్నామని ప్రతాని రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే గొప్ప లక్ష్యంతో ఆర్.కె.గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, అద్భుతమైన స్పందన లభించిందని జ్యూరీ ఛైర్మన్ ఇంద్రజ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ వైస్ ప్రెసిడెంట్ గురురాజ్, ఫైట్ మాస్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.