“ది ప్యారడైజ్’లో నాని పాత్ర కొత్తగా ఉంటుంది. ఇండియన్ స్క్రీన్‌పై రెండు జడలతో హీరో కనిపించడం బహుశా ఇదే ప్రథమం. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. ‘దసరా’ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇందులో యాక్షన్ ఉంటుంది. మాతో పాటు నవకాంత్, రియల్ సతీశ్ కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పనిచేశారు’ అని ఫైట్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ తెలిపారు. అగ్ర కథానాయకుడు నాని నటించిన పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్నది. ఫైట్‌మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్‌లు శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు.
‘నాని ఈ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లో నటించడం ఇదే తొలిసారి. పైగా జడలతో యాక్షన్ అంత ఈజీ కాదు. ఆయన కెరీర్లో బహుశా ఇంత కష్టం ఎప్పుడూ పడి ఉండదు. మేం అయితే.. మా అసిస్టెంట్‌కి అలాగే జడలు వేయించి, అందులో ఉండే కష్టాన్ని తెలుసుకుని మరీ యాక్షన్‌ని డిజైన్ చేశాం’ అని చెప్పారు రామ్‌లక్ష్మణ్. ఇంకా చెబుతూ ‘సహజంగానే యాక్షన్‌ని డిమాండ్ చేసే కథ ఇది. బేర్ బాడీతో చేయాల్సిన రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి. మోహన్‌బాబుకి కూడా ఇందులో యాక్షన్ సీక్వెన్సులున్నాయి’ అని తెలిపారు రామ్‌లక్ష్మణ్.