August Movies | సినీవాకిట ప్రతి నెలా పండుగే! వారం వారం సందడే!! ఏడాదంతా కోలాహలంగా ఉండే బాక్సాఫీస్,కొన్ని స్పెషల్ నెలల్లో సెన్సేషన్ సినిమాలతో కళకళలాడుతుంది.అలాంటి మాసాల్లో ఆగస్టు ఒకటి. ఈ రెయినీ సీజన్లో విడుదలయ్యే చిత్రాలు కాస్త హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు.. కలెక్షన్ల వరద మొదలైనట్టే! ఈ పంద్రాగస్టు సందర్భంగా వెండితెర కొత్త సినిమాలతో ముస్తాబవుతున్నది. వర్ష రుతువులో సినీ హర్షాతిరేకాల్లో మీరూ తడిసిముద్దయిపోండి..
భోళా మానియా షురూ
సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ఊపుమీదున్నాడు చిరంజీవి. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన ఆగస్టులో ‘భోళా శంకర్’ మూవీతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు మెగాస్టార్. ఫస్ట్ గ్లింప్స్ విడుదలైనప్పుడు మొదలైన భోళా మానియా.. ఫిల్మ్ దునియాకు కొత్త కిక్ ఇచ్చింది. ఇందులో చిరు సరసన తమన్నా నటిస్తున్నది. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపిస్తున్నది. తమిళంలో విజయవంతమైన ‘వేదాళం’ చిత్రానికి ఇది రీమేక్. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండటంతో చిరు అభిమానుల్లో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది! గతంలో ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలు భారీ ఫ్లాప్‌లు మూటగట్టుకోవడమే ఇందుకు కారణం! అయితే ఇప్పటి వరకు బయటికి వచ్చిన చిరంజీవి లుక్స్, పాటలు, స్టెప్పులు అభిమానులను అలరించడంతో సినిమా కూడా అదేస్థాయిలో ఉంటుందని మెగాఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇందులో యాక్షన్‌తోపాటు కామెడీకి స్కోప్ ఉండటంతో చిరంజీవి మార్క్ టైమింగ్ మ్యాజిక్ చేస్తుందని నమ్ముతున్నారు. మొత్తంగా ఈ నెల 11న థియేటర్ల దగ్గర ‘భోళా శంకర్’ తాండవం ఖాయమని ఫిక్సవుతున్నారు.
నిన్ను చూడాలయ్యా..!
దాదాపు రెండేండ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. రాజకీయాల్లోకి అడుగు పెట్టొద్దని నిర్ణయించు కున్నప్పటి నుంచి తలైవా సినిమాల స్పీడ్ పెంచాడు. అయితే 2021 నవంబర్‌లో విడుదలైన ‘పెద్దన్న’ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేక పోయింది. దీంతో, భారీ తారాగణంతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధ మవుతున్నాడు రజనీకాంత్. కామెడీ, యాక్షన్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘జైలర్’ ఈ నెల 10న విడుదలవుతున్నది. నెల్సన్ దిలీప్‌కుమార్ దీనికి దర్శకుడు. విజయ్ హీరోగా నటించిన ‘బీస్ట్’ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన నెల్సన్ ఈ చిత్రాన్ని రజనీ ఇమేజ్‌కు తగ్గట్టుగా పకడ్బందీగా తీర్చిదిద్దాడని ఇండస్ట్రీ టాక్. ఇందులో రజనీ సరసన రమ్యకృష్ణ నటిస్తున్నది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఆయన పాత్ర ఏమిటన్నది సస్పెన్స్. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, ‘పుష్ప’ విలన్ సునీల్, జాకీష్రాఫ్, తమన్నా తదితరులు రజనీతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు సినిమాపై క్రేజ్ పెంచాయి. తమన్నా నర్తించిన ‘నువ్వు కావాలయ్యా..’ పాట సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నది. ‘హుకుం’ ట్రాక్ కూడా రజనీ అభిమానులను అలరించింది. మొత్తంగా ఆగస్టు రేస్‌లో ‘జైలర్’ షేర్ ఎంతో వారంలో తేలిపోనుంది.
బాలీవుడ్ బొనాంజా
2001లో విడుదలైన చిత్రాల్లో ‘గదర్- ఏక్ ప్రేమ్ కథ’ సంచలనం సృష్టించింది! ఈ సినిమాలో సన్నీ దేవోల్, అమిషా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. దేశ విభజన నేపథ్యంలో ఒక ప్రేమజంట కథను హృద్యంగా ఆవిష్కరించాడు దర్శకుడు అనిల్ శర్మ. మళ్లీ 22 ఏండ్ల తర్వాత ‘గదర్ 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి జోడీ సన్నీ, అమిషా మరోసారి ప్రేక్షకులను కనువిందు చేయనుంది. మరో జంటగా ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్ కనిపించనున్నారు. నోస్టాలజీ మూవీగా పేరున్న గదర్‌కు సీక్వెల్‌గా వస్తున్న రెండో సినిమా కోసం అప్పటి యువతరం ఇప్పుడు ఆత్రంగా ఎదురుచూస్తున్నది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుంది. అమిత్ రాయ్ దర్శకత్వంలో అక్షయ్ హీరోగా వస్తున్న చిత్రం ‘ఓఎమ్‌జీ 2’. ఇందులో అక్షయ్ శివుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దాదాపు 30 కత్తిరింపులకు గురైందన్న వార్త ‘ఓఎమ్‌జీ 2’పై మరిన్ని అంచనాలు పెంచింది. ఇది కూడా పదకొండునే రిలీజవుతున్నది.
అసలేం జరిగింది..?
‘2012 డిసెంబర్ 21, ఇవాళ్టికి డెడ్‌లైన్! ఆ తర్వాత ఏం జరుగుతుంది?’ డైలాగ్‌తో ‘బెదురులంక 2012’ టీజర్ మొదలవుతుంది. దీన్ని చూడగానే అంతుకుముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం కాబోతున్నదని తెలుసుకోవాలని సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. ఆ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ నెల 25 వరకు ఎదురుచూడాల్సిందే! ‘ఆర్ఎక్స్ 100’తో యూత్ మతులు పోగొట్టాడు హీరో కార్తికేయ. అడపాదడపా హిట్లు సాధిస్తూ, విలన్‌గా కూడా రాణిస్తూ మంచి నటుడు అనిపించుకున్నాడు. కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ‘బెదురులంక 2012’ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి కథానాయిక. డ్రామా, కామెడీ మిక్స్ చేసి డ్రామెడీగా చిత్రాన్ని తీర్చిదిద్దామని దర్శకుడి మాట. పక్కా పల్లెటూరి నేపథ్యంతో నిర్మించిన ‘బెదురులంక’కు బాక్సాఫీస్ దగ్గర ఎదురు ఉండదని నిర్మాణ సంస్థ విశ్వాసం వ్యక్తం చేస్తున్నది.
గురి కుదిరేనా..!
మెగా ఫ్యామిలీలో మంచి హైటున్నోడు వరుణ్ తేజ్. ‘ఫిదా’, ‘కంచె’, ‘ఎఫ్2’, ‘గద్దలకొండ గణేశ్’ వంటి హిట్లతో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్నాడు ఈ యంగ్ హీరో! అయితే గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ‘గని’ ఫ్లాప్ మూటగట్టుకోవడంతో రేస్‌లో కాస్త వెనుకబడ్డాడు. ఇప్పుడు ‘గాండీవధారి అర్జున’తో విజయంపై గురిపెట్టాడు. ‘గుంటూరు టాకీస్’, ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాలతో వైవిధ్యమైన డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. స్పై యాక్షన్ కథాంశంతో దీన్ని రూపొందించాడు. ట్రైలర్లో చూపించిన మేరకు యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఇక వరుణ్ సరసన మీనాక్షి చౌధురి నటిస్తున్నది. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.