Variety India | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 90 ఏళ్ల ఘనమైన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న అక్కినేని త్రయం (అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, అఖిల్) తాజాగా సరికొత్త స్టైలిష్ లుక్స్‌తో అదరగొట్టారు. ప్రముఖ అంతర్జాతీయ వినోద మీడియా సంస్థ ‘వెరైటీ ఇండియా’ (Variety India) రెండో ఎడిషన్ కవర్ పేజీపై ఈ ముగ్గురు హీరోలు మెరిశారు. ఈ సందర్భంగా నాగార్జునతో పాటు అతడి కుమారులు వారి సినీ ప్రయాణం, కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అక్కినేని కుటుంబం నుంచి తొమ్మిది దశాబ్దాల సినిమా చరిత్ర కొనసాగుతుండటం పట్ల టాలీవుడ్ కింగ్ నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. లెగసీ అంటే కేవలం నటులుగా ఉండటం కాదని, మొత్తం సినిమా రంగానికే సేవ చేయడమని ఆయన స్పష్టం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి అడుగుజాడల్లో తాను ప్రయాణించానని, ఇప్పుడు తన కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా అదే బాటలో నడుస్తున్నారని తెలిపారు. సృజనాత్మక రంగంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో చెబుతూ, షూటింగ్ సెట్స్‌లో ఎవరికోసం ఎప్పుడూ ఇబ్బంది కలిగించకూడదనే తన సిద్ధాంతాన్ని గుర్తుచేసుకున్నారు. ‘శివ’, ‘గీతాంజలి’ వంటి సాహసోపేతమైన చిత్రాలతో తాను ఎలా కొత్త మార్గాన్ని ఎంచుకున్నానో, అదే రీతిలో కుమారులు కూడా సొంత గుర్తింపు తెచ్చుకోవాలని నాగార్జున ఆకాంక్షించారు.
నాగచైతన్య మాట్లాడుతూ.. దాదాపు 90 ఏళ్ల సినిమా ప్రయాణం కాలాతీతమైనదని, తాత నాగేశ్వరరావు, తండ్రి నాగార్జునల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చైతూ తెలిపారు. సినిమా పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో తనకంటూ ఒక స్టైల్ వెతుక్కునే క్రమంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని, అయితే కాలక్రమేణా సినిమాపై ఉన్న ఇష్టంతో ఆ సవాళ్లను అధిగమించానని చెప్పారు. విజయాల తర్వాత వచ్చే భయం గురించి మాట్లాడుతూ, కేవలం ఫార్ములాలను నమ్ముకోకుండా ఒరిజినల్ ఛాయిస్‌లతో ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. అలాగే, థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు నటులకు సరికొత్త ప్రయోగాలు చేసేందుకు అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నాయని, భవిష్యత్తులో ఆ వైపుగా మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉందని నాగచైతన్య మనసులో మాట పంచుకున్నారు.
ఇక అక్కినేని కుటుంబం అందించిన లెగసీని కాపాడుకోవడం తమ బాధ్యత అని యంగ్ హీరో అఖిల్ అక్కినేని పేర్కొన్నారు. తమ కుటుంబం నుంచి వచ్చిన వారసత్వాన్ని ‘బంగారు బ్యాటన్’తో పోల్చిన ఆయన, దానిని మరింత ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. నాన్న నాగార్జునతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని, ఈ వయసులో కూడా ఆయనలో ఉన్న సినిమాపై ఆకలి, తపన తనను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంటాయని చెప్పారు. పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, వ్యక్తిగతంగా ఎదురయ్యే అంచనాలు, ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నారో వివరించారు. భవిష్యత్తులోనూ అక్కినేని కుటుంబం నుంచి ఇలాగే అద్భుతమైన సినిమాలు వస్తాయని, తమ తాత ఇచ్చిన వారసత్వాన్ని ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటామని అఖిల్ భావోద్వేగంగా పంచుకున్నారు.