కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రయాణం సాగిస్తున్నారు యువ హీరో విశ్వక్సేన్. తనదైన దూకుడు వ్యక్తిత్వంతో యువతరంలో మంచిక్రేజ్ను సంపాదించుకున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఓరి దేవుడా’. అశ్వథ్ మారిముత్తు దర్శకుడు. సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం విశ్వక్సేన్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
2020లోనే ఈ ప్రాజెక్ట్ ఖరారైంది. ఓ సున్నితమైన పాయింట్‌తో ఈ సినిమాను తెర కెక్కించాం. ఒరిజినల్ కథ తాలూకు ఫీల్ మిస్ కావొద్దని తమిళ మాతృక ‘ఓ మై కడవులే’ను డైరెక్ట్ చేసిన అశ్వథ్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నాం. తెలుగు నేటివిటీకి తగిన మార్పులతో మరింత సృజనాత్మక హంగులతో ఆయన సినిమాను తీర్చిదిద్దాడు. వెంకటేష్‌గారితో కలిసి నటించడం ఓ సర్ప్రైజ్లా అనిపించింది. అంతటి సీనియర్ నటుడితో తెరను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా.
కథలు, పాత్రలు ఎంపికలో ఎలాంటి పరిమితులు విధించుకోలేదు. ఇప్పుడు నాకు ఇరవైఏడేండ్లు. మరో మూడునాలుగేండ్ల వరకు పాత్రలపరంగా ప్రయోగాలు చేయాలనుకుంటున్నా. నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనే తపనతో కథల్ని ఎంపిక చేసుకుంటున్నా. ముప్పైఏండ్లు దాటిన తర్వాతే బాక్సాఫీస్ లెక్కలు, స్టార్డమ్ గురించి ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నా. నా కెరీర్ విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నా. షూటింగ్ సమయంలో వెంకటేష్‌గారి దగ్గరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. షాట్ గ్యాప్‌లో ఆయన తర్వాత చేయబోయే సీన్ రిహార్సల్ చేస్తూ కనిపించేవారు. ఆయన్ని చూస్తే ఏదో సాధించామని రిలాక్స్ కాకుండా నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉండాలనే విషయం అర్థమైంది. సినిమా ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా అంకితభావంతో మన బాధ్యతల్ని నిర్వర్తించాలని వెంకటేష్‌గారు చెప్పారు.
డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ‘హిట్’ సీక్వెల్లో నటించలేకపోయాను. ఆ విషయంలో ఎలాంటి బాధలేదు. కథల ఎంపికలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటా. ఎవరి సలహాలు తీసుకోను. నా తదుపరి చిత్రంగా ‘దాస్ కా ధమ్కీ’ రాబోతున్నది. ‘ఫలక్‌నుమా దాస్’ సీక్వెల్ కోసం స్క్రిప్ట్‌ను డెవలప్ చేసే పనిలో ఉన్నా. పాన్ ఇండియా స్థాయిలో ఆ సినిమాను తీయాలనే ఆలోచన ఉంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌మీదకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం రామ్ తాళ్లూరి నిర్మాతగా ఓ సినిమా అంగీకరించా. అతి త్వరలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నా. కథలు నచ్చితే మల్టీస్టారర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా.