TN CM Vijay | తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రముఖ నటుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన అట్టహాసమైన వేడుకలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ ఆయనతో ప్రమాణం చేయించారు. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ అనూహ్య విజయాన్ని అందుకుంది. తన పార్టీకి వచ్చిన సీట్లతో పాటు విసికె (VCK), ఐయుఎంఎల్ (IUML) వంటి పార్టీల మద్దతుతో మేజిక్ ఫిగర్ 118 దాటి, 120 మంది ఎమ్మెల్యేల బలంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం తమిళనాడు సెక్రటేరియట్ భవనంకి చేరుకున్న విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మరోవైపు ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ తమిళనాడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారదర్శకమైన మరియు అవినీతి లేని పాలనను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మహిళల రక్షణ మరియు సంక్షేమానికి తన ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. అలాగే నేను రాజకీయ వారసత్వంతో రాలేదు, మీలో ఒకడిగా, మీ ఇంటి బిడ్డగా ఇక్కడికి చేరుకున్నాను అంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ మరియు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ తన సన్నిహితుడు బుస్సీ ఆనంద్‌కు కేబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ విజయంతో తమిళనాడు రాజకీయాల్లో దళపతి యుగం మొదలైందని ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
#WATCH | Chennai: Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay takes charge as the Chief Minister of Tamil Nadu, at the Tamil Nadu Secretariat. pic.twitter.com/nJttMh6ioH
— ANI (@ANI) May 10, 2026