తాయ్ కిళవి
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది,
తారాగణం: రాధిక శరత్‌కుమార్, సింగమ్ పులి, రైచల్ రెబెక, అరుళ్దాస్ తదితరులు,
దర్శకత్వం: శివకుమార్ మురుగేశన్
డబ్బుకు లోకం దాసోహం. మనిషి బతకాలన్నా.. ఆ మనిషిని బతికించాలన్నా డబ్బే అవసరం. ఇలా పైకం చుట్టూ తిరిగే కథలెన్నో వెండితెరపై సందడి చేశాయి. బాక్సాఫీస్ దగ్గర డబ్బును బాగానే వసూలు చేశాయి. ఇదే విషయాన్ని కాస్త వినోదాత్మకంగా వివరించే ప్రయత్నమే.. తాయ్ కిళవి చిత్రం. రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం.. రూ.75 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ యేడాది తమిళ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తాజాగా, జియో హాట్‌స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమింగ్కు వచ్చింది. బంధాలన్నీ డబ్బు చుట్టే తిరుగుతూ.. నానాటికీ తీసికట్టుగా మారుతున్న మానవ సంబంధాలను హృద్యంగా ఆవిష్కరించిన ఈ చిత్ర కథలోకి వెళ్తే..
ఒక మారుమూల గ్రామంలో ఉండే పవునుతాయి (రాధికా శరత్ కుమార్) అనే వృద్ధురాలి చుట్టూ తిరిగే కథ ఇది. పవునుతాయి అంటే.. ఊరివాళ్లంతా హడలిపోతుంటారు. అందుకు కారణం.. వాళ్లంతా ఆమె దగ్గర అప్పు తీసుకున్నవారే. అందుకే, వడ్డీ కోసం ఆమె వస్తున్నదంటే.. ఎక్కడి వాళ్లు అక్కడ తప్పించుకుని తిరుగుతుంటారు. అయినా, వదలదామె. దొరికినవారి దగ్గర ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తుంది. అందుకే ఆమె ఎప్పుడు చచ్చిపోతుందా? అని అందరూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు. ఇక పవునుతాయి వ్యక్తిగత జీవితం వేరేలా ఉంటుంది. ఆమె కూతురు సురుళి (రైచల్), మనవడు రాజు.. తల్లి దగ్గరే ఉంటారు. మూడు తులాల బంగారం విషయంలో అల్లుడితో మనస్పర్థలు రావడం వల్లే.. సురిళిని పుట్టింటికి పంపిస్తాడు.
ఇక పవునుతాయి ముగ్గురు కొడుకులు కూడా ఆస్తి విషయంలో తల్లితో గొడవపడతారు. భార్యలతో కలిసి ఇల్లొదిలి వెళ్లిపోతారు. కాలం అలా గడుస్తుండగా.. ఒక రోజున పవునుతాయికి పక్షవాతం వస్తుంది. కాళ్లు-చేతులతోపాటు మాట కూడా పడిపోతుంది. కేవలం చేతులతోనే సైగలు చేస్తుంటుంది. ఎక్కువ సేపు స్పృహలో కూడా ఉండలేదు. దాంతో ఇక తమకు ఆమె వేధింపులు ఉండవని ఊళ్లో వాళ్లు సంబురపడతారు.
ఆస్తుల కోసం కొడుకులు-కోడళ్లు, బంగారం కోసం అల్లుడు ఆమెముందు వాలిపోతారు. ఆమె ఎప్పుడు చనిపోతుందా?! అని ఎదురుచూస్తుంటారు. ఇంతలోనే ఓ బంగారం షాపు నుంచి ఒక వ్యక్తి వారి ఇంటికి వస్తాడు. కొన్ని రోజుల క్రితం పవునుతాయి తన దగ్గర నుంచి భారీగా బంగారం తెచ్చిందని కుటుంబ సభ్యులతో చెబుతాడు. బంగారం మాట వినగానే.. కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు? దాన్ని ఎక్కడ దాచిందో తెలుసుకోవడానికి ఏం చేస్తారు? పవునుతాయి దాచిన బంగారాన్ని ఎలా కనిపెట్టారు? ఈ క్రమంలో వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అన్నది కథ.