సినిమా తారలకుండే హడావుడి జీవితం నుంచి కాస్త విరామం తీసుకుంటున్నా అని చెబుతున్నది స్టార్ హీరోయిన్ ఇలియానా. అవసరం ఉన్నా, లేకున్నా మీడియా ముందుకురావడం, ప్రచార కార్యక్రమాలు, అవార్డు ఫంక్షన్లలో పాల్గొనడం తగ్గించానని చెప్పిందీ నాయిక. నిత్యం తానెక్కడ ఉన్నదీ సోషల్ మీడియాలో పూసగుచ్చినట్లు చెప్పాల్సిన అవసరమూ లేదని ఆమె అభిప్రాయపడింది. ఇటీవల మీరు కనిపించడం లేదేంటి? అనే ప్రశ్నకు ఇలియానా సమాధానమిస్తూ…‘ఎప్పుడూ ఏదో ఓ మీడియాలో కనిపిస్తేనే నేను ఇండస్ట్రీలో ఉన్నానని అనుకోవడం తప్పు. నేనెక్కడికీ వెళ్లలేదు. ఇక్కడే ఉన్నా.
నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నా. ఊరికే బయట కార్యక్రమాల్లో పాల్గొని హడావుడి చేయడం తగ్గించా. అలా రోజూ బయటకొస్తేనే దర్శక నిర్మాతలు పరిచయం అవుతారు. వారే అవకాశాలు ఇస్తారని అనుకోవడం సరికాదు. మీరలా అనుకుంటారంతే. నా నట ప్రతిభ తెలిసిన వారు తప్పకుండా తమ సినిమాల్లో ఆఫర్స్ ఇస్తారు’ అని చెప్పింది. ప్రస్తుతం ‘తేరా క్యా హోగా లవ్లీ’ చిత్రంతో పాటు విద్యా బాలన్, ప్రతీక్ గాంధీలతో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నది ఇలియానా.