అంబరానికేగిన అరుదైన నటుడు
తెలుగు తెరపై దశాబ్దాలపాటు దేదీప్యమానంగా వెలిగిన నట నక్షత్రం నేలరాలింది. విలక్షణ నటనకు చిరునామాగా నిలిచిన ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
తెలుగు తెరపై దశాబ్దాలపాటు దేదీప్యమానంగా వెలిగిన నట నక్షత్రం నేలరాలింది. విలక్షణ నటనకు చిరునామాగా నిలిచిన ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. గిరిబాబు మరణవార్తతో తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వెలిబుచ్చారు.
ఊరి జనానికి సినిమా పిచ్చోడు
1946 జూన్ 8న ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు అసలు పేరు యర్రా శేషగిరిరావు. రైతు కుటుంబంలో జన్మించిన గిరిబాబుకు చిన్నప్పట్నుంచీ నటనపై మక్కువ. సినిమాలంటే పిచ్చి. ఊరి టూరింగ్ టాకీసులోనే ఎక్కువ సమయాన్ని గడిపేవారాయన. అందుకే ఊరంతా ఆయన్ని సినిమా పిచ్చోడు అని పిలిచేవారు. సొంతగా నాటక సమాజాన్ని స్థాపించి, రంగస్థలంపై పలు అద్భుతమైన పాత్రలు పోషించిన అనుభవం గిరిబాబుది. గిరిబాబులోని కళాతృష్ణను గమనించిన కుటుంబ సభ్యులు, మిత్రులు.. ఆయన్ని సినీరంగం వైపు ప్రోత్సహించారు. దాంతో ఆయన అడుగులు మద్రాస్ వైపు పడ్డాయి.
ప్రారంభంలో ఒడిదుడుకులు
‘ధైర్యే సాహసే లక్ష్మి’ చిత్రం కోసం తొలిసారి కెమెరా ముందు నిలబడ్డారు గిరిబాబు. అయితే.. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ‘తప్పటడుగులు’, ‘స్వర్గానికి నిచ్చెనలు’ అనే సినిమాల్లో అవకాశాలొచ్చాయి. ఆ సినిమాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఆ విధంగా గిరిబాబు కెరీర్ ప్రారంభమే ఒడిదుడుకులతో మొదలైంది. గిరిబాబు అప్పటికే వివాహితుడు. ముగ్గురు పిల్లలు కూడా. పైగా తాను నటిస్తున్న సినిమాల వివరాలు పేపర్లలో వచ్చాయి. దాంతో తిరిగి ఊరెళితే అవమానంగా భావించారు గిరిబాబు. అందుకే మద్రాసులోనే ఉంటూ నాటకాల్లో నటించేవారు.
‘జగమేమాయ’తో అరంగేట్రం
గిరిబాబు స్వగ్రామంలో ఉన్న సమయంలో నవోదయ ఆర్ట్ పిక్చర్స్‌వారి ‘జగమేమాయ’(1973) చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. కొత్తవారితో తెరకెక్కిస్తున్నారని తెలియడంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మరోసారి రైలెక్కారు గిరిబాబు. ఆ రైల్లోనే అదే సినిమాకు ఆడిషన్ ఇచ్చేందుకు వెళ్తున్న నటుడు మురళీమోహన్ ఆయనకు పరిచయం అయ్యారు. ఇద్దరూ కలిసే వెళ్లి ఆడిషన్ ఇచ్చారు. చివరకు ఆ సినిమాలోని హీరో పాత్ర మురళీమోహన్‌ని వరించగా, గిరిబాబు విలన్ పాత్రతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. కానీ కాలక్రమంలో గిరిబాబు స్టార్ విలన్‌గా అవతరించారు. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి అద్భుతమైన నటుడిగా కితాబులందుకున్నారు. విలక్షణ నటనకు చిరునామాగా నిలిచారు. క్యారెక్టర్ నటుడిగా, విలన్‌గా, హాస్య నటుడిగా, హీరోగా.. ఇలా తన కెరీర్లో అన్ని రకాల పాత్రలూ పోషించిన అరుదైన నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు గిరిబాబు.
మరపురాని పాత్రలు
సూపర్‌స్టార్ కృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’లో దుశ్శాసనుడిగా నటించి అభినందనలు అందుకున్నారు గిరిబాబు. ఆయన కెరీర్లో సూపర్‌స్టార్ కృష్ణతో ఎక్కువ సినిమాల్లో నటించడం విశేషం. వారిద్దరి కలయికలో వచ్చిన సావాసగాళ్లు, ముందడుగు, అడివి సింహాలు, దొంగోడొచ్చాడు, కొడుకు దిద్దిన కాపురం తదితర సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక కె.రాఘవేంద్రరావు ‘జ్యోతి’ చిత్రం గిరిబాబు కెరీర్లో ఓ మైల్స్టోన్. అందులో విలన్‌గా ఆయన నటనకు జనం జేజేలు పలికారు. ఎన్టీఆర్‌తో అన్నదమ్ముల అనుబంధం, నేరం నాదికాదు ఆకలిది, మాదైవం, నాదేశం.. తదితర చిత్రాల్లో నటించారు గిరిబాబు.
చిరంజీవితో నటించిన విజేత, దొంగమొగుడు, అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, అల్లుడా మజాకా చిత్రాలు నటుడిగా గిరిబాబుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. బాలకృష్ణతో కలియుగకృష్ణుడు, భైరవద్వీపం, నాగార్జునతో హలోబ్రదర్, సిసింద్రీ, నిన్నే పెళ్లాడతా, ఆవిడా మావిడే.. ఇలా దాదాపుగా హీరోలందరితో కలిసి నటించారాయన. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన సినిమాలు గిరిబాబుకి మంచిపేరు తెచ్చిపెట్టాయి. వాటిలో ‘పెళ్లాం చెబితే వినాలి’ చిత్రాన్ని ముఖ్యంగా చెప్పుకోవాలి. అందులో పెద్దకొడుకుగా నట విశ్వరూపాన్ని చూపించారాయన. అలాగే.. పీఎన్ రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం భళారే విచిత్రం’లో మేనేజర్ పాత్ర ద్వారా నవ్వుల పువ్వులు పూయించారు గిరిబాబు. ఇంకా కల్పన, నువ్వేకావాలి, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, ప్రేమలేఖలు, ప్రతినిధి, కితకితలు, ఎవడైతే నాకేంటి, అతడు, బిందాస్, అఆ, గీతగోవిందం, శ్రీకారం.. ఇలా దాదాపుగా 600 సినిమాల్లో విభిన్నమైన పాత్రల్ని పోషించి విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు గిరిబాబు. అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నటుడిగా ఆయన చివరి సినిమా.
దమ్మున్న నిర్మాత
జయభేరీ సంస్థ అనగానే అందరికీ నిర్మాతగా మురళీమోహన్ గుర్తొస్తారు. కానీ ఆ సంస్థకు వ్యవస్థాపక నిర్మాత గిరిబాబే. ఆ సంస్థపై ఆయన నిర్మించిన తొలి సినిమా ‘దేవతలారా దీవించండి’ . తెలుగు తెరపై ఏకైక బ్లాక్ అండ్ వైట్ సినిమా స్కోప్ చిత్రం అదే కావడం విశేషం. అలాగే.. ఎన్టీఆర్ ‘సింహబలుడు’ సినిమాకు పోటీగా ‘సింహగర్జన’ సినిమాను నిర్మించి, విడుదల చేసిన ఘనత గిరిబాబుది. కృష్ణ హీరోగా రూపొందిన ఆ చిత్రంలో గిరిబాబు కూడా ఓ హీరోగా నటించారు.
ఈ రెండు సినిమాలూ జానపద చిత్రాలే కావడం విశేషం. అలాగే.. చిరంజీవి ‘కొదమసింహం’ చిత్రానికి పోటీగా తన కొడుకు బోసుబాబుని హీరోగా పరిచయం చేస్తూ ‘ఇంద్రజిత్’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి, విడుదల చేశారు గిరిబాబు. ‘కొదమసింహం’ లాగే ‘ఇంద్రజిత్’ కూడా కౌబాయ్ మూవీనే కావడం విశేషం. ఆ విధంగా దమ్మున్న నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. అలాగే.. ‘దేవతలారా దీవించండి’ సినిమా ద్వారా కొమ్మినేని శేషగిరిరావు, ‘మెరుపుదాడి’ చిత్రం ద్వారా పీఎన్ రామచంద్రరావులను దర్శకులుగా పరిచయం చేశారు గిరిబాబు. ఈ రెండు సినిమాలూ బ్లాక్‌బస్టర్స్ కావడం విశేషం. కొన్ని చేదు అనుభవాల తర్వాత గిరిబాబు చిత్రనిర్మాణానికి స్వస్తి పలికారు. దాంతో మిత్రుడైన మురళీమోహన్ అడగడంతో తన జయభేరీ సంస్థను ఫ్రెండ్లీగా ఇచ్చేశారాయన. ఇక గిరిబాబు దర్శకత్వంలో మూడు సినిమాలు వచ్చాయి. అవే.. రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుకున్నా. ఈ మూడు సినిమాలూ ఆయనకు చేదు అనుభవాలనే మిగిల్చాయి.
సొంత ఊరిపై మమకారం
సొంత ఊరు రావినూతలపై గిరిబాబుకు అపారమైన ప్రేమ. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి సంక్రాంతినీ కుటుంబ సమేతంగా రావినూతల వెళ్లి, అక్కడే జరుపుకునేవారాయన. ఆరోగ్యం సహకరించినన్ని రోజులూ ఈ విధాన్నాన్ని పాటిస్తూనే ఉన్నారు గిరిబాబు. ఆ ఊరి అభివృద్ధిలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన పెద్ద కుమారుడు రఘుబాబు ప్రస్తుతం టాలీవుడ్లో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
గిరిబాబు ఇకలేరనే వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
విలక్షణమైన నటనతో తెలుగుతెరపై వెలిగారాయన. నిర్మాతగా, దర్శకునిగా తెలుగు సినిమాకు గిరిబాబు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన లేకపోవడం తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
– అగ్ర నటుడు చిరంజీవి
మద్రాస్‌లో ఉన్నప్పుడు నేనూ, గిరిబాబు రూమ్మెట్స్. ఇండస్ట్రీలో నాకంటే ముందు తను నటుడయ్యారు. గిరిబాబు గొప్ప మనసున్న వ్యక్తి. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారాయన. నటుడిగా, నిర్మాతగా, దర్శకునిగా ఎన్నో విజయాలను అందుకున్నారు. అలాంటి వ్యక్తి కన్నుమూయడం బాధగా ఉంది. గిరిబాబు ఆత్మకు శాంతి, ఆయన కుటుంబానికి మనశ్శాంతి కలగాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నా.
– అగ్ర నటుడు మోహన్‌బాబు
గిరిబాబు మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత శ్రీ గిరిబాబు మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో వందలాది చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించడంతో పాటు, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. గిరిబాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేరొంటూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

