తెలుగు సినిమా చరిత్ర పుస్తకంలో కొందరివి పేరాలైతే.. కొందరివి పేజీలు. అధ్యాయాలు మాత్రం కొంతమందికే ఉంటాయి. ఆ కొందరిలో చంద్రమోహన్ ఒకరు. అవును.. తెలుగు సినిమా చరిత్రలో చంద్రమోహన్‌ది ఓ అధ్యాయం. ‘వీడు హైట్ లేకపోవడం చాలామంది హీరోలకు వరం.. వీడికి శాపం. ఓ బెత్తెడుంటే సినిమాను శాసించేవాడు ’ అని ఎస్వీరంగారావు లాంటి మహానటుడు అన్నాడంటే చంద్రమోహన్ నటనా సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. తన సహజమైన అభినయంతో నాలుగు తరాల ప్రేక్షకుల్ని అలరించిన మహానటుడు చంద్రమోహన్. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవచ్చు.. కానీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆరాధ్యనటుడిగా చంద్రమోహన్ స్థానం సుస్థిరం.
కథానాయికలకు లక్కీయెస్ట్ హీరో చంద్రమోహన్. ఆయన పక్కన నటిస్తే, ఏ హీరోయినైనా స్టార్ హీరోయిన్ అయిపోతుందని అప్పట్లో గట్టి నమ్మకం. అనుకున్నట్టే ఆయనతో జతకట్టిన కథానాయికలందరూ తారాపథంలోకి దూసుకుపోయారు. చంద్రమోహన్ హీరోగా మాత్రమే ఎదగాలనుకోలేదు. నటుడిగా ఎదగాలనుకున్నారు. ఎదిగారు. ఈ క్రమంలో ఓవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు సాటి హీరోలకు స్నేహితుడిగా, తమ్ముడిగా, అన్నగా, విలన్‌గా విభిన్న పాత్రల్లో కనిపిస్తుండేవారు. అందుకే హీరోగా రిటైర్ అయినా నటుడిగా మాత్రం చంద్రమోహన్ రిటైర్ కాలేదు. ఆరోగ్యం సహకరిస్తున్నంతకాలం నటిస్తూనే ఉన్నారు.
ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు
ఆర్థిక క్రమశిక్షణలేక కంటిముందే కాలగర్భంలో కలిసిపోయిన ఎందరో మహానటుల జీవితాలకు చంద్రమోహన్ ప్రత్యక్షసాక్షి. అందుకే వారి జీవితాలనే పాఠాలుగా చేసుకున్నారు. ప్రతి రూపాయినీ జాగ్రత్తగా కాపాడుకున్నారు. కోట్లకు అధిపతిగా ఎదిగారు. తర్వాత తరం నటీనటులకు నటనాపరంగానే కాక, ఆర్థికపరంగా కూడా ఆదర్శప్రాయుడయ్యారు..
మహానటుడితో నువ్వానేనా
సుఖదుఃఖాలు(1968).. నటుడిగా చంద్రమోహన్‌కి తొలి మలుపు. ఈ సినిమా ఓ చరిత్ర. దర్శకుడు కె.బాలచందర్ రచించిన ‘మేజర్ చంద్రకాంత్’ అనే నాటకానికి తెరరూపం ‘సుఖదుఃఖాలు’. ఇందులో ఎస్వీరంగారావును ఢీకొట్టే పాత్రలో నటించారు చంద్రమోహన్. సినిమా నిడివి దాదాపు రెండు గంటల నలభై నిమిషాలు ఉంటే, అందులో దాదాపు 40 నిమిషాలు చంద్రమోహన్, ఎస్వీరంగారావు ఇద్దరే తెరపై ఉంటారు. ఇద్దరిమధ్యే డ్రామా నడుస్తుంది. అప్పటికి తెలుగు సినిమాల్లో ఇదొక వినూత్న ప్రయోగం. అంతటి మహానటుడిని ఢీకొనడమేకాదు.. నువ్వానేనా అనే స్థాయిలో నటించాడు చంద్రమోహన్. అదే ఏడాది వచ్చిన ‘బంగారుపిచ్చుక’ సోలో హీరోగా చంద్రమోహన్ తొలి సినిమా. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తల్లి చాటు కొడుకుగా విభిన్నమైన పాత్ర పోషించారు. ఆయనలోని కామెడీ యాంగిల్‌ని బయటపెట్టిన సినిమా ఇది.
‘సిరిసిరిమువ్వ’కు నీరాజనం
‘సిరిసిరిమువ్వ’(1976).. నటుడిగా చంద్రమోహన్‌కి మేలిమలుపు ఈ సినిమా. దర్శకుడు కె.విశ్వనాథ్‌ని కళాతపస్విగా మార్చింది ఈ సినిమా. ఇందులో కళారాధకుడైన డప్పు కళాకారుడిగా నటించారు చంద్రమోహన్. ఇందులోని చంద్రమోహన్ నటనకు తెలుగుప్రజలు నీరాజనాలు పట్టారు. ఇదే పాత్రను హిందీలో రిషికపూర్ పోషించారు. కానీ చంద్రమోహన్ చేసిన దాంట్లో సగం కూడా చేయలేకపోయారు. ఈ విషయాన్ని స్వయంగా విశ్వనాథే పలు సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత విశ్వనాథ్ తీసిన శంకరాభరణం, శుభోదయం చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు చంద్రమోహన్.
కమల్‌హాసన్‌ను మించి..
1978వ సంవత్సరంలో నెలరోజుల గ్యాప్‌తో చంద్రమోహన్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి ‘సీతామాలక్ష్మి’ కాగా, రెండోది ‘పదహారేళ్ల వయసు’. రెండూ సంబంధం లేని పాత్రలు. ‘సీతామాలక్ష్మి’లో సినిమా పోస్టర్లంటించే కొండయ్యగా, ‘పదహారేళ్లవయసు’లో అంగవైకల్యం, అమాయకత్వం కలగలిసిన గోపాలకృష్ణగా చంద్రమోహన్ నటన నభూతో నభవిష్యత్. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకు భారతీరాజా తమిళ సినిమా ‘పదునారు వైదినిలే’ మాతృక. చంద్రమోహన్ పోషించిన పాత్రను అందులో కమల్‌హాసన్ చేశారు. ప్రథమంగా కమల్‌హాసనే చేసినా.. ఆ పాత్ర విషయంలో ఇద్దరినీ పోల్చిచూస్తే చంద్రమోహన్‌కే ఓ మార్కు ఎక్కువ పడుతుంది. అందులో సందేహమేలేదు.
ఫాంటసీ రామకృష్ణుడు
జంధ్యాల దర్శకత్వంలో చేసిన రెండు రెళ్లు ఆరు, జయంబు నిశ్చయంబురా, వివాహభోజనంబు, అలాగే రేలంగి నరసింహారావు దర్శకత్వంలో చేసిన చిలిపి దంపతులు, ఓ ఇంటికాపురం.. తదితర చిత్రాలు కామెడీ హీరోగా చంద్రమోహన్‌లోని మరో కోణాన్ని చూపిస్తాయి. ‘ఆదిత్య 369’లో వికటకవి తెనాలి రామకృష్ణుడిగా నటించారు చంద్రమోహన్. ఆయన కెరీర్లో మన్మథుడిగా, అభిమన్యుడిగా, యక్షుడిగా పలు పౌరాణిక పాత్రలు పోషించారు. అయితే.. ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో చారిత్రాత్మక పాత్రయిన తెనాలి రామకృష్ణకవిగా నటించడం ఆయన కెరీర్లో ప్రత్యేకం. ఇందులో మహానటుడు అక్కినేనినే తలపించింది చంద్రమోహన్ అభినయం.
లెక్కకు మించిన పాత్రలు
బాపుగారి ‘రాధాకళ్యాణం’లో పాలఘాట్ మాధవన్. మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశాలకోసం తిరుగుతున్న తమిళ యువకుడిపాత్ర. ఇందులో చంద్రమోహన్ నటించలేదు.. బిహేవ్ చేశారు. అందులో తమిళయాసతో ఆయన అభినయం ఎన్నటికీ మరిచిపోలేం. ‘శుభోదయం’లో సోమరిపోతు, ‘కాంచనగంగ’లో విధివంచితుడైన భర్త, ‘శ్రీమతి ఒక బహుమతి’లో అతి మంచివాడైన ఇంటిపెద్ద, ‘ఆడదే ఆధారం’లో తండ్రిని భరించే కొడుకు, ఇంకా కలికాలం, సగటు మనిషి, పెద్దరికం, మూడుముళ్లు, పెళ్లిచూపులు, ప్రతిఘటన, ఆమె, 7/జి బృందావన్ కాలనీ.. ఇలా అన్నీ వైవిధ్యమైన పాత్రలే.
అనుకరించలేని అభినయం
చంద్రమోహన్ సక్సెస్ఫుల్ హీరో.. సక్సెస్ఫుల్ కమెడియన్.. సక్సెస్ఫుల్ కేరక్టర్ ఆర్టిస్ట్. ఇంకా మాట్లాడితే సక్సెస్ఫుల్ విలన్ కూడా. చంద్రమోహన్ చేయకూడని పాత్ర ఉందేమోగానీ.. చేయలేని పాత్రను ఇంతవరకూ ఏ రచయితా సృష్టించలేదు.. సృష్టించలేరు కూడా. ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అనుకరించలేని వాయిస్, అనుసరించలేని అభినయపాటవం చంద్రమోహన్‌కి మాత్రమే సొంతం.
ప్రఖ్యాత నటుడు చంద్రమోహన్(82) కన్నుమూశారు. కొన్నేళ్లుగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. ఆయన భార్య జలంధర ప్రముఖ నవలా రచయిత్రి. చంద్రమోహన్‌కి ఇద్దరు కుమార్తెలు. 1942 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో చంద్రమోహన్ జన్మించారు. బాపట్లలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశారు. 900ల పైచిలుకు చిత్రాల్లో నటించిన చంద్రమోహన్ పోషించని పాత్ర లేదు. ప్రఖ్యాత దర్శకుడు బీఎన్రెడ్డిగారి ‘రంగులరాట్నం’(1966) చంద్రమోహన్ తొలి సినిమా. ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ‘రంగులరాట్నం’ ఉత్తమచిత్రంగా నిలిచింది. సుదీర్ఘ నట ప్రస్థానంలో చంద్రమోహన్ రెండు ఫిలింఫేర్, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. సోమవారం హైదరాబాద్‌లో చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.