తెలంగాణ జానపద గీతాల్లో అద్భుత నాట్యాభినయాన్ని ప్రదర్శిస్తూ మంచి పేరు సంపాదించుకుంది నాగదుర్గ. ఆమె పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్ సోషల్మీడియాలో రికార్డు స్థాయి వీక్షణలతో ప్రేక్షకుల్ని అలరించాయి. తాజాగా ఆమె కథానాయికగా అరంగేట్రం చేస్తున్నది. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నీ వాసు తెరకెక్కిస్తుండటం విశేషం.
తెలంగాణ నేపథ్య కుటుంబ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ నెల 25న లాంఛనంగా సినిమాను ప్రారంభించి, వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ పేర్కొన్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.