CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన లుక్‌ను మార్చాడు. తన మేనేజర్ జగదీష్ పళనిసామి గృహప్రవేశ వేడుకలో సాంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి సందడి చేశారు. ఆయన ఎప్పుడూ కనిపించే నల్లటి బ్లేజర్ లుక్కు భిన్నంగా ఈ సాంప్రదాయ శైలిలో కనిపించడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి విజయ్ సాధారణంగా నల్లటి బ్లేజర్, తెల్లటి షర్ట్ మరియు నల్లటి ప్యాంటు ధరిస్తూ వస్తున్నారు. అయితే, చెన్నైలో జరిగిన తన మేనేజర్ జగదీష్ కొత్త ఇంటి ప్రారంభోత్సవానికి మాత్రం ఆయన పూర్తి సాంప్రదాయ లుక్‌లో హాజరయ్యారు. విజయ్ ఈ వేడుకకు విచ్చేసిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన ఇంట్లోకి అడుగుపెట్టగానే అక్కడున్న వారంతా చప్పట్లతో, కేరింతలతో ఘన స్వాగతం పలికారు. జగదీష్ కుటుంబ సభ్యులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ హగ్ చేసుకున్నారు. ఈ వేడుకకు హాజరయ్యే ముందు విజయ్ సచివాలయంలో కూడా ఇదే సాంప్రదాయ దుస్తులలో కనిపించడం విశేషం. జగదీష్‌తో మంచి అనుబంధం ఉన్న నటుడు కతీర్ కూడా ఈ వీడియోలో కనిపించారు.
గత దశాబ్ద కాలంగా జగదీష్, విజయ్‌కి అత్యంత నమ్మకమైన మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సినిమా డేట్లు, ఇతర బాధ్యతలను చూసుకోవడంతో పాటు విజయ్ నటించిన ‘మాస్టర్’, ‘లియో’ చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలాగే విజయ్ సేతుపతి ‘మహారాజా’, కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’ చిత్రాలకు పనిచేశారు. ‘రూట్’ అనే టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా ఆయన నడుపుతున్నారు. ఇటీవలే సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా జగదీష్ ఆయనతోనే ఉన్నారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.