Suriya | సినిమాలకు ప్రధాన బలమే నిర్మాతలు. కథను నమ్మి కోట్లకు కోట్లు దారపోసి సినిమాలు తీస్తారు. హిట్టయి, లాభాలు తెచ్చిపెడితే ఓకే కానీ, ఫలితం తేడా కొట్టిందంటే ఆ నిర్మాత పరిస్థితి ఊహించలేము. అలా ఫలితాలు తేడాకొట్టి రోడ్డున పడిన నిర్మాతలు లెక్కలేనంత మంది ఉన్నారు. కాగా తాజాగా ఓ నిర్మాత పరిస్థితి కూడా అంతేమారింది. రజినీకాంత్, విజయ్‌కాంత్, సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన నిర్మాత వీఏ దురై ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు కూడా డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వీఏ దురై ఎవర్గ్రీన్ ఇంటర్నేషనల్ అనే బ్యానర్‌ను స్థాపించి పలు సినిమాలను నిర్మించాడు. అయితే ఆయన నిర్మించిన సినిమాల్లో పితామగన్ తప్పితే మరేసినమా పేరును కానీ, డబ్బు కానీ తెచ్చిపెట్టలేకపోయాయి. దాంతో తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన మధుమేహం అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ చికిత్సకు కావాల్సిన డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నాడు. ఇదే విషయాన్ని దురై స్నేహితుడు ఫేస్బుక్లో దురై పరిస్థితిని తెలుపుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియోను చూసిన సూర్య వెంటనే స్పందించి దురైకి రూ.2 లక్షల ఆర్థిక సహాయం చేశాడు. అంతేకాకుండా నిత్యం అందుబాటులో ఉండి దురైకు అండగా నిలుస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. సూర్యతో పాటు పలువురు తమిళ నటులు, దర్శకులు కూడా తమవంతు నగదు ఇస్తున్నారు.