తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. అర్థరాత్రి ఛాతినొప్పి రావడంతో ఆయన్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విలన్ పాత్రల ద్వారా ఆయన గుర్తింపును పొందారు. దక్షిణాదిలో దాదాపు 50కిపైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో వడ చెన్నై, కాక్క కాక్క, వేైట్టెయాడు విళయాడు, తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యారు. తమిళ టెలీ సీరియల్స్ ద్వారా నటుడిగా ఆయన కెరీర్ ఆరంభించారు.
‘చితి’ అనే ధారావాహికలో ఆయన డేనియల్ అనే పాత్రను పోషించారు. దానికి మంచి గుర్తింపు దక్కడంతో తన పేరు ముందు డేనియల్ను చేర్చుకొని డేనియల్ బాలాజీగా సినిమాల్లో కొనసాగారు. ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసిన డేనియల్ బాలాజీ దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి అడుగుపెట్టి నటుడిగా స్థిరపడ్డారు. తెరపై విలన్ పాత్రలు పోషించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం సేవా కార్యక్రమాల ద్వారా గొప్ప మనసును చాటుకున్నారు. అవివాహితుడైన డేనియల్ బాలాజీ అనేక గుప్తదానాలతో వితరణశీలిగా పేరు తెచ్చుకున్నారు. తాను సంపాదించిన డబ్బులను ఓ గుడిని కట్టించడానికి ఉపయోగించాడు. డేనియల్ బాలాజీ మృతిపట్ల పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.