Mayookha | ‘మయూఖ’ మూవీ రివ్యూ.. భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్!
Mayookha | విడుదలకు ముందే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్లో 'బెస్ట్ మిస్టరీ మూవీ' అవార్డును దక్కించుకుని భారీ అంచనాలను క్రియేట్ చేసిన చిత్రం ‘మయూఖ’.
నటీనటులు: పాయల్ చెంగప్ప, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా దబ్బారా, అమన్ మసూద్ తదితరులు
దర్శకుడు: శ్రీ తేజ్ ఎస్కే (శ్రీకాంత్ కండ్రేగుల)
సంగీతం: సిబి మాథ్యూ అలెక్స్
ఎడిటర్: శరత్ జె
విడుదల తేది: అక్టోబర్ 9, 2026
విడుదలకు ముందే న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్లో ‘బెస్ట్ మిస్టరీ మూవీ’ అవార్డును దక్కించుకుని భారీ అంచనాలను క్రియేట్ చేసిన చిత్రం ‘మయూఖ’. టాలీవుడ్లో ఇప్పటివరకు ఎవరూ కవర్ చేయని సరికొత్త ‘ఫ్రాంగింగ్’ (Fronging) అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
మయూఖ (పాయల్ చెంగప్ప) ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఒంటరిగా నివసిస్తుంటుంది. అయితే ఆమెలో చిన్నప్పటి నుంచే భయం కాస్త ఎక్కువే. ఆమె ఉంటున్న ఫ్లాట్‌లోకి తరచూ ఒక అపరిచిత వ్యక్తి వచ్చిపోతుంటాడు. తను లేనప్పుడు ఎవరో తన గదిలోకి ప్రవేశిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా, తగిన ఆధారాలు లేవని వారు నమ్మరు. ఇదే సమయంలో నగరంలో వరుస హత్యలు కలకలం రేపుతుంటాయి. ఈ పరిస్థితుల్లో అపార్ట్మెంట్లోని వాచ్మెన్ నుంచి ఓనర్ వరకు ప్రతీ ఒక్కరినీ మయూఖ అనుమానిస్తుంటుంది. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఆమె సహోద్యోగి ఒకరు ఆ రోజు గదికి వచ్చి వెళ్లినట్లు తెలుస్తుంది. అదే వ్యక్తి ఆ రోజు రాత్రి మయూఖ ఇంటికి వచ్చి డోర్ బెల్ కొట్టగానే, భయంతో తను తలుపు తెరుస్తుంది. అతను లోపలికి రాగానే ఆమె గదికి లాక్ వేసి పోలీసులకు సమాచారం ఇస్తుంది. పోలీసులు వచ్చేసరికి ఆ సహోద్యోగి విగతజీవుడిగా పడి ఉంటాడు.
ఈ హత్య కేసులో పోలీసులు మయూఖను అరెస్ట్ చేస్తారు. కానీ విచారణలో ఆమె ఆ హత్య చేయలేదని తేలుతుంది. మరి ఆ హత్య వెనుక అసలు నిజం ఏంటి? మయూఖను నిత్యం భయపెడుతున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? నిజంగానే ఆమె గదిలో మరొకరు ఉన్నారా లేక ఇదంతా ఆమె మానసిక భ్రమేనా? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘మయూఖ’ కథ.
విశ్లేషణ
మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు కావాల్సిన ప్రధాన బలం ఊహకందని ట్విస్టులు, ఉత్కంఠభరితమైన కథనం. దర్శకుడు శ్రీ తేజ్ ఎస్కే ఈ విషయంలో సఫలమయ్యారనే చెప్పాలి. టాలీవుడ్లో తొలిసారిగా ‘ఫ్రాంగింగ్’ అనే కొత్త పాయింట్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మర్డర్ సీన్‌తో ప్రారంభమయ్యే కథ, ఆ వెంటనే మయూఖ మానసిక స్థితిని పరిచయం చేస్తూ ప్రేక్షకులను కథలోకి లాగుతుంది. ఫస్టాఫ్ అంతా మయూఖ భయాలు, ఆమె గదిలో ఎవరో ఉన్నారనే అనుమానాల చుట్టూ నడుస్తుంది. ఇది నిజంగా జరుగుతోందా లేక ఆమె భ్రమా అనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో సృష్టిస్తుంది.
ఇక సెకండాఫ్‌లో దర్శకుడు ఒక్కో మిస్టరీని విప్పుతూ కథను పరుగులు పెట్టిస్తాడు. ప్రతి పాత్ర మీద అనుమానం కలిగేలా స్క్రీన్ ప్లేను నడిపించిన తీరు బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కు ముందు వచ్చే చివరి అరగంట సినిమాను నిలబెట్టింది. అయితే, సైకో కిల్లర్ బ్యాక్‌గ్రౌండ్ రివీల్ అయిన తర్వాత తర్వాతి పరిణామాలు కాస్త ఊహకందేలా ఉంటాయి. అయినప్పటికీ, థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం మంచి అనుభూతిని పంచుతుంది.
నటీనటులు
పాయల్ చెంగప్ప తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఒంటరి అమ్మాయిగా, భయంతో సతమతమయ్యే పాత్రలో ఆమె నటన సినిమాను నడిపించింది. బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్ కీలక పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిష్మా దబ్బారా తదితరులు తమ పరిధి మేరకు చక్కటి అభినయం ప్రదర్శించారు.
సాంకేతిక విభాగం:
సిబి మాథ్యూ అలెక్స్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రాణంగా నిలిచింది. థ్రిల్లర్ మూమెంట్ల వద్ద ఆయన ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులను సీట్లలో కదలకుండా చేస్తుంది. విజువల్స్ మూడ్‌కి తగినట్లుగా చాలా డార్క్ అండ్ రియాలిస్టిక్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
చివరిగా.. కొత్తదనంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్లను, సైకో కిల్లర్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘మయూఖ’ మంచి ఛాయిస్ అవుతుంది. వీకెండ్లో డిఫరెంట్ సినిమా చూడాలనుకునేవారు నిరభ్యంతరంగా చూడవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mayookha | ‘మయూఖ’ మూవీ రివ్యూ.. భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్!
‘పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలి’
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

