Shah Rukh Khan | బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు సుప్రీంకోర్టులో పెద్ద ఉపశమనం లభించింది. ముంబై బాంద్రాలోని ఆయన ఇల్లు ‘మన్నత్’ అదనపు నిర్మాణ పనులకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) ఇచ్చిన అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ముంబైకి చెందిన సోషల్ యాక్టివిస్ట్ సంతోష్ దౌండ్కర్ దాఖలు చేసిన ఈ అప్పీల్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. అయితే అసలు ఈ పిటిషన్ వేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని, దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది.
మన్నత్ బంగళా నిర్మాణ అనుమతులపై సంతోష్ దౌండ్కర్ గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)ను కూడా ఆశ్రయించారు. కానీ ఆ పిటిషన్లో ఎలాంటి నిజాలు లేవని చెప్తూ 2025 సెప్టెంబర్‌లో ఎన్జీటీ దాన్ని తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. ఒక సెలబ్రిటీకి సంబంధించిన కేసు కాబట్టి దీనిని ప్రత్యేకంగా చూడొద్దని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టును కోరగా.. తాము అవతలి వ్యక్తి స్టార్‌డమ్‌ను చూసి ప్రభావితం కాలేదని జడ్జీలు స్పష్టం చేశారు. ఒక వ్యక్తి తన సొంత ఇంట్లో అదనపు అంతస్తులు నిర్మించుకోవాలనుకుంటే అది వారి వ్యక్తిగత విషయమని, చట్టపరమైన నిబంధనలను వారు కరెక్ట్‌గా పాటించినప్పుడు ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది.