సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్ జంటగా నటిస్తున్న సినిమా ‘ 7డేస్ 6నైట్స్’. రోషన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్‌తో కలిసి సుమంత్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నటుడు రోషన్ సినిమా విశేషాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..‘ఎంఎస్ రాజు ఈ సినిమాలో మంగళం అనే క్యారెక్టర్‌కు నేను సరిపోతానని అవకాశం ఇచ్చారు. అమ్మాయిలతో సులువుగా కలిసిపోయి సరదాగా ఉండే పాత్రలో కనిపిస్తాను. అతనికి అనిపించింది చేస్తుంటాడు, తర్వాత ఏం జరుగుతుందోనని ఆలోచించడు. అలాంటి వ్యక్తిత్వంతో మంగళం పాత్ర ఉంటుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతుంటాను. యూత్‌ఫుల్ సినిమా అయినా అసభ్యత లేకుండా తెరకెక్కించారు. స్నేహితుడు ఆనంద్‌తో కలిసి మంగళం బ్యాచ్‌లర్ ట్రిప్‌కు వెళ్తాడు. ఆ సమయంలో వీళ్లకు ఎదురైన సంఘటనలు ఏంటి అనేది చిత్ర కథగా ఉంటుంది.’ అన్నారు.