నిర్మాత ఎంఎస్ రాజు వారసుడిగా ‘తూనీగా తూనీగా’ చిత్రంతో తెరంగేట్రం చేశారు సుమంత్ అశ్విన్. ‘కేరింత’, ‘హ్యపీ వెడ్డింగ్’ వంటి చిత్రాలతో నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నటిస్తున్న సినిమా ‘7డేస్ 6నైట్స్’. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్‌తో కలిసి సుమంత్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో సుమంత్ అశ్విన్ సినిమా విశేషాలు తెలిపారు.
మంచి కథ ఉంటే ఏ తరహా సినిమా అయినా ప్రేక్షకులు చూస్తారు. ఈ ట్రైలర్ చూసి బోల్డ్ కంటెంట్ ఉంటుందేమో అనుకుంటున్నారు కానీ బలమైన కథ చెబుతున్నాం. ‘డర్డీ హరి’ సినిమా రిలీజ్ ముందు కూడా ఆడియెన్స్‌కు ఇలాంటి ఇంప్రెషన్ కలిగింది. సినిమా విడుదలయ్యాక ఎంతోమంది ఫోన్ కాల్స్ చేసి సినిమాలో మంచి విషయం చెప్పారు అన్నారు. ఈ చిత్రానికీ అలాంటి పేరే వస్తుందని నమ్ముతున్నాం. కొందరు స్నేహితులు బ్యాచ్‌లర్ ట్రిప్‌కు వెళ్తే..అకడ వారికి ఎదురైన ఆసక్తికర ఘటనల నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. నాన్న ఈ సినిమా కోసం రీసెర్చ్ చేశారు. ఇప్పటి యువతీ యువకుల ఆలోచనల తీరు ఎలా ఉంది, వాళ్లు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది స్టడీ చేశారు. ఆయన చూసిన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకునే క్యారెక్టర్లను డిజైన్ చేశారు. సినిమా అంతా సరదాగా సాగుతుంది. ఇందులో హద్దు దాటిన రొమాన్స్ ఉండదు. మీరు మిగతా వారితో కలిసి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. బయటకు వెళ్లేప్పుడు ఓ మంచి కథను చూశాం అనే అనుభూతి కలుగుతుంది. గోవా, బెంగళూరు, గోకర్ణ లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. ఈ లొకేషన్స్ అన్నీ సినిమాకు విజువల్ బ్యూటీ తీసుకొచ్చాయి.
పాత్రలోనే హీరోయిజం ఉంటుంది
ఈ సినిమాలో నేను ఆనంద్ అనే పాత్రలో నటించాను. ఈ క్యారెక్టర్ కోసం జిమ్ చేసి, జుట్టు పెంచి కొత్త లుక్ లోకి మారాను. నా పాత్రకు బాధాకరమైన నేపథ్యం ఉంటుంది. అతను దేనికీ ఎకువగా రియాక్ట్ అవడు. బయట కుర్రాళ్లు ఎలా సహజంగా మాట్లాడుతుంటారో ఇతనూ అలాగే ప్రవర్తిస్తాడు. అందంగా కనిపించాలని, బాగా డ్రెస్సింగ్ చేసుకోవాలనీ ఉండదు. ఆ పాత్రలా కనిపించాలని జుట్టు పెంచాను. ఆనంద్ పాత్రలోనే హీరోయిజం ఉంది. కథలో సందర్భానుసారం అది బయటకొస్తుంది. అందుకే అతని కోసం బిల్డప్ షాట్స్, ఎంట్రీ సీన్స్ ప్రత్యేకంగా పెట్టలేదు. నేను ఇప్పటిదాకా నటించిన పాత్రల్లో ఇది చాలా సహజమైన, వాస్తవికంగా ఉండే క్యారెక్టర్. ప్రేక్షకులు ఈ క్యారెక్టర్ ను ఇష్టపడతారని ఆశిస్తున్నా.
కాన్సెప్ట్ సినిమాలు చేస్తాం
నాన్న మనసులో ఎన్నో కథలు తిరుగుతుంటాయి. ఊరికే ఒక లైన్‌గా కథ చెబుతుంటారు. ఈ సినిమా కూడా అలా చెప్పిందే. వెంటనే బాగుందని నిర్మాణ పనులు ప్రారంభించాం. ‘డర్టీ హరి’ సినిమా తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. కొత్త కథలను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం కలిగింది. అందుకే ఇకపై రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాం. నాన్నకు ఆయన తొలి సినిమా ‘శత్రువు’ నుంచి ఇప్పటిదాకా సినిమా రచన, రూపకల్పన మీదున్నప్యాషన్ ఏమాత్రం తగ్గలేదు.