Suhas | ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళ స్టార్ హీరో సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మండాడి’ సినిమాతో సుహాస్ తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో సుహాస్ హీరోగా కాకుండా మెయిన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సుహాస్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ‘మండాడి’కి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
సుహాస్ ఇప్పటివరకు ఎక్కువగా హీరో పాత్రల్లో కనిపించినప్పటికీ.. తనకు కేవలం హీరోగానే నటించాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అన్ని రకాల పాత్రలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను గతంలో నటించిన ‘ఫ్యామిలీ డ్రామా’ సినిమాలో పోషించిన సైకో పాత్రను చూసిన దర్శకుడు.. ‘మండాడి’లో నెగెటివ్ రోల్ చేసే అవకాశం ఇచ్చినట్లు సుహాస్ చెప్పారు. కథ, పాత్ర నచ్చితే హీరో, విలన్ అనే తేడా లేకుండా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ‘మండాడి’ సినిమా బోట్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ తన కెరీర్లోనే అత్యంత కష్టమైన అనుభవాల్లో ఒకటని సుహాస్ తెలిపారు.
మొత్తం 130 రోజుల పాటు షూటింగ్ జరిగిందని, అందులో ఏకంగా 74 రోజులు సముద్రంలోనే చిత్రీకరణ చేసినట్లు చెప్పారు. సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్‌ను పూర్తి చేయడానికి సుమారు 45 రోజులు పట్టిందని, ఇంటర్వెల్ బ్లాక్ కోసం మరో 17 రోజుల పాటు షూటింగ్ నిర్వహించామని వెల్లడించారు. సముద్రంలో షూటింగ్ చేయడం చాలా ప్రమాదకరమైన అనుభవమని సుహాస్ చెప్పారు. సుమారు 15 కిలోమీటర్ల లోపలికి వెళ్లి షూటింగ్ చేసేవాళ్లమని, అక్కడి పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవని తెలిపారు. గాలి ఎక్కువగా వీచిన సమయంలో పడవలు అదుపుతప్పి బోల్తా పడే పరిస్థితులు ఎదురయ్యేవని సుహాస్ వివరించారు. అలాంటి సమయంలో సరైన సమయంలో పడవ నుంచి దూకకపోతే పడవలు తమపై పడే ప్రమాదం ఉండేదని చెప్పారు. ఒక్కోసారి పడవలు ఒకదానికొకటి ఢీకొనేవని, వాటి నుంచి తప్పించుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేదని తెలిపారు. ఈ షూటింగ్లో కొన్ని సందర్భాల్లో తాము చావు నుంచి తప్పించుకున్నామనే భావన కలిగిందని సుహాస్ పేర్కొన్నారు. ఇంతటి రిస్క్‌తో ఇప్పటివరకు తాను మరే సినిమా చేయలేదని చెప్పారు.