Haromhara | చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే 1989నాటి కథాంశంతో సుధీర్‌బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. ఇటీవలే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంటున్నదని చిత్రబృందం ఆనందం వెలిబుచ్చింది.
ప్రమోషన్లో భాగంగా గురువారం ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేశారు. ‘హరోం హర’ అంటూ సాగే ఈ పాటను చైతన్ భరద్వాజ్ స్వరసారథ్యంలో కల్యాణ్‌చక్రవర్తి త్రిపురనేని రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సాహిత్యంతోపాటు చిత్రీకరణ కూడా సుధీర్‌బాబు పాత్ర నైజాన్ని అద్దంపట్టేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్.