నటీనటులు – సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు
సాంకేతిక నిపుణులు – సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ : ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, దర్శకత్వం: హరి – హరీష్
ఇటీవల ఎక్కువ చర్చకు వచ్చిన విషయాల్లో సమంత (Samantha) అనారోగ్యం ఒకటి. తన కొత్త సినిమా యశోద ప్రచార కార్యక్రమాల్లో సమంత మాటలన్నీ విన్నవారిని భావోద్వేగాలకు గురిచేశాయి. మయోసైటిస్ అనే వ్యాధితో ఇబ్బందులను పడుతూనే సమంత సినిమా కోసం పనిచేయడం పని పట్ల ఆమె అంకితభావాన్ని సూచించాయి. ఇవన్నీ సినిమా పట్ల ఆసక్తినీ రేపాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన యశోద (Yashoda) సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
మధ్య తరగతి యువతి యశోద (సమంత) ఆర్థిక అవసరాలతో ఈవా అనే సంస్థ నిర్వహిస్తున్న సరోగిసీ(అద్దె గర్భం)కి ఒప్పుకుంటుంది. కోటీశ్వరుల ఇంటి బిడ్డను కడుపులో మోస్తున్న యశోదను సకల సౌకర్యాలు ఉన్న ఓ ప్రత్యేక ప్రదేశానికి ఆ కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్తారు. ఈవాను సంస్థను మధుబాల (వరలక్ష్మీ శరత్ కుమార్), డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) నిర్వహిస్తుంటారు. ఈ సంస్థ యశోద లాగే ఎంతోమంది యువతులను సరోగసీ కోసం ఉపయోగించుకుంటుంది. వారికి యశోద మంచి మిత్రురాలు అవుతుంది. మరోవైపు వ్యాపారవేత్త శివ్ రెడ్డి, మోడల్ అయిన అతని స్నేహితురాలు ఆరుషి కారు ప్రమాదంలో మరణిస్తారు. ఈకేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ కమిషనర్ బలరాం (మురళీ శర్మ), వాసుదేవ్ (సంపత్ రాజ్), రిషి (శత్రు) రంగంలోకి దిగుతారు.
వీళ్ల విచారణలో ప్రపంచం నలుమూలల నుంచి వందలాది మంది యువతులు (సెలబ్రిటీలు, సినీ తారలతో సహా) నగరానికి వస్తున్నారని తెలుస్తుంది. వీరిలో ఒక హాలీవుడ్ నటి ఒలీవియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతుంది. శివ్ రెడ్డి కారు యాక్సిడెంట్ కేసుతో పాటు ఒలీవియా మృతి కేసునూ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇక్కడ ఈవాలో డెలివరీ కోసం వెళ్లిన తన స్నేహితులు తిరిగి రాకపోవడంతో యశోదకు అనుమానం మొదలవుతుంది. ఈ సంస్థలో రహస్య గదుల్లోకి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఈ ప్రయత్నంలో యశోదకు విస్తుపోయే విషయాలు తెలుస్తాయి.
సరోగసీ పేరుతో ఈవా చేస్తున్న నేరాలు ఏంటి, ఈ సంస్థకు కేంద్ర మంత్రి గిరిధర్ (రావు రమేష్)కు ఉన్న సంబంధం ఏంటి, ఈవా సంస్థ నుంచి అమాయకులైన వందలాది మంది యువతులను యశోద ఎలా కాపాడింది. ఆమె నేపథ్యం ఏంటి అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
సరోగసీ చాటున కొన్ని సంస్థలు చేస్తున్న క్రూరమైన నేరాలను ఆధారంగా చేసుకుని రాసిన కథ ఇది. మానవత్వానికి మచ్చ తెచ్చే ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా హేయమే. డబ్బు పేరుతో పేద, మధ్య తరగతి యువతులను వలలో వేసుకుంటున్న కొన్ని సంస్థల తీరు గురించి సినిమాలో చర్చించడం అభినందనీయం. ఇలాంటి సినిమాలు చూసైనా యువతులు మోసపోకుండా ఉంటే అదే ఈ సినిమాకు నిజమైన సార్థకత. మరోవైపు ఈ అకృత్యాలను తెరపై చూడటం కూడా ఇబ్బందికరమే. ప్రెగ్నెన్సీతో ఉన్న సోదరి ఏమాత్రం ఇబ్బందిపడినా మనం చూడలేకపోతాం. అలాంటిది ఈ సినిమాలో వారి మీద జరిగే వ్యాపారం, హింసను చూసేందుకు మనసు చెదిరిపోతుంది. ప్రేక్షకులకు ఆద్యంతం ఎక్కడా ఉపశమనమే దొరకదు.
ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదిరించే అమ్మాయిగా..
దర్శకులు చాలా జాగ్రత్తగా సినిమాను రూపొందించారు. కానీ కథానుసారం కొన్ని సన్నివేశాలు, బ్లడ్ షెడ్ చూపించడం వారికి తప్పలేదు. సరోగసీ సంస్థ, అందులోకి యువతులు వెళ్లడం, అక్కడ వారి జీవితం సాగే విధానం ఇవన్నీ చూపిస్తూ వెళ్లిన దర్శకుడు ఇంటర్వెల్ ముందు అసలు కథను రివీల్ చేస్తూ ఆసక్తి క్రియేట్ చేశాడు. ద్వితీయార్థంలో అసలు ఈ సంస్థ ఏంటనేది ఒక్కో మలుపుతో వివరిస్తూ వెళ్లాడు. కేవలం ప్రొఫెషనలిజం కోసం చేస్తున్నారు అనుకునే పాత్రల నిజ స్వరూపాలన్నీ సెకండాఫ్ లో తెలుస్తాయి. వీరి ఆట కట్టించేందుకు యశోద చేసిన సాహసాలు ఆకట్టుకుంటాయి.
యశోద సినిమాను తన భుజాలపై మోసింది సమంత. సినిమాకు అన్నీ తానై నడిపించింది. చెల్లిని ప్రేమించే సోదరిగా, తను కోరుకున్న వృత్తిలో స్థిరపడేందుకు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదిరించే అమ్మాయిగా, తనలాంటి అమాయక యువతులను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయని సాహసిగా సమంత భావోద్వేగపూరిత నటన మెప్పిస్తుంది. సమంత చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ సీన్స్ లో నటిస్తున్నప్పుడు ఆమె పడిన కష్టం తెరపై ప్రతి ప్రేక్షకుడూ ఫీలవుతారు. అవసరమైతే ఈ పిల్లలందరికీ నేను తల్లినవుతా ఎందుంటే నేను యశోదను, ఆ కృష్ణ పరమాత్ముడికే తల్లిని అని పతాక సన్నివేశాల్లో ఆమె చెప్పే సంభాషణలు విజిల్స్ వేయించాయి.
మధుబాల పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్, డాక్టర్ గౌతమ్ గా ఉన్ని ముకుందన్ స్టైలిష్ విలనిజం చూపించారు. రావు రమేష్, సంపత్ రాజ్, మురళీ శర్మ, శత్రు నటన ఆకట్టుకుంటుంది. ఒకవైపు కారు ప్రమాదం సన్నివేశం, విదేశీ నటి మృతి, వాటి మీద జరిగే ఇన్వెస్టిగేషన్, మరోవైపు ఈవా సంస్థలో యశోద జీవితం..రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్లి దర్శకులు హరి హరీష్ సినిమా మీద ఆసక్తిని కలిగించారు. స్క్రీన్ ప్లేలో వారి ప్రతిభ కనిపించింది. అశోక్ చేసిన ఆర్ట్ వర్క్ బాగుంది. మణిశర్మ సంగీతం, సుకుమార్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తాయి.
ఫ్లస్ పాయింట్స్
సమంత నటన
కథలోని భావోద్వేగాలు
ద్వితీయార్థంలోని మలుపులు
మైనస్ పాయింట్స్
ప్రథమార్థం
పతాక సన్నివేశాలు
చివరగా : యశోద.. ఏ ఫిల్మ్ బై సమంత
రేటింగ్ : 2.5/5