Korean Movie | హారర్ మరియు సస్పెన్స్ చిత్రాల ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునేలా ఒక సరికొత్త కొరియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ది వైలింగ్’, ‘ది ఎల్లో సీ’ వంటి మైండ్ బ్లోయింగ్ సినిమాలను అందించిన దర్శకుడు నా హాంగ్-జిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హోప్’ (HOPE) చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో దక్షిణ కొరియాలోని ఒక మారుమూల గ్రామం ‘హోప్ హార్బర్’ నేపథ్యంలో కథ సాగుతుంది. గ్రామంలో హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చి విధ్వంసం సృష్టిస్తున్న ఒక రహస్యమైన వింత జీవిని పట్టుకోవడానికి పోలీస్ చీఫ్ బమ్-సియోక్ (హ్వాంగ్ జంగ్-మిన్), ఆఫీసర్ సంగ్-ఏ (హోయోన్) రంగంలోకి దిగుతారు. అదే సమయంలో సమీపంలోని అడవిలో సంగ్-కి (జో ఇన్-సంగ్) నేతృత్వంలోని వేటగాళ్ల బృందం కూడా ఆ వింత జీవిని వేటాడటానికి బయలుదేరుతుంది. కానీ, అక్కడ పరిస్థితులు పూర్తిగా తారుమారై ఆ జీవిని వేటాడబోయిన వారే దానికి బలవుతుంటారు. ఒక చిన్న అపోహ, అజ్ఞానంతో మొదలైన ఈ సంఘర్షణ.. మానవజాతి మధ్య వివాదాలకు దారితీసి, చివరికి ఊహించని ఒక సృష్టి విపత్తుగా ఎలా మారింది అనేదే ఈ చిత్ర కథాంశం. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు, అత్యద్భుతమైన విజువల్స్‌తో కూడిన ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రం సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.