Jana Nayagan | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ముందే లీక్ కావడం తమిళ సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో పూర్తిస్థాయిలో అడుగుపెట్టే ముందు ఇదే తన చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలకు ముందే కీలక ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిర్మాతలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా కీలక పురోగతి సాధించారు. ‘జన నాయగన్’ చిత్రానికి సంబంధించిన లీక్ ఫుటేజ్‌ను సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా విస్తృతంగా షేర్ చేసిన ఆరోపణలపై ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నిందితులు సినిమా కీలక సన్నివేశాలను ఇతరులకు పంపించడం, వాటిని వైరల్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. అరెస్టైన వారి వద్ద నుంచి పలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వాటిని డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. అసలు సినిమా ఫుటేజ్ నిందితుల చేతికి ఎలా చేరింది? లీక్‌కు మూలం ఎక్కడ? అనే అంశాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.పోలీసులు కేవలం ఈ ఆరుగురితోనే కేసును ముగించకుండా, దీని వెనుక ఉన్న పెద్ద పైరసీ నెట్‌వర్క్‌ను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నిందితుల సోషల్ మీడియా కార్యకలాపాలు, కమ్యూనికేషన్ రికార్డులు, డిజిటల్ ట్రాన్సాక్షన్లను కూడా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరికొంత మంది ప్రమేయం ఉన్న అవకాశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉంటే, లీక్ అయిన ఫుటేజ్‌ను చూసిన కొందరు ప్రేక్షకులు ‘జన నాయగన్’ కథపై సోషల్ మీడియాలో చర్చలు ప్రారంభించారు. ఈ చిత్రం గతంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని, కథలో కొన్ని మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమా విడుదలకు ముందే కీలక సన్నివేశాలు బయటకు రావడం వల్ల బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి లీక్ ఘటన పెద్ద దెబ్బగా మారే అవకాశముందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. ‘జన నాయగన్’ లీక్ కేసు తమిళ సినీ పరిశ్రమలో పైరసీ సమస్యపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.