సినిమా పేరు: సింగ్ గీతం
తారాగణం : అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి..
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: నాగ్ అశ్విన్
నిర్మాణం: వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్
94ఏండ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఫాంటసీ కామెడీ మ్యూజికల్ ఫిల్మ్ ‘సింగ్ గీతం’. మాటల్లేకుండా ‘పుష్పక విమానం’ వంటి గొప్ప క్లాసిక్‌ని తెరకెక్కించిన సింగీతం.. ‘మాటలే పాటలైతే’ అని కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించారని తెలియగానే, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి మొదలైంది. పైగా ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించడం, సింగీతం విజన్‌కి నాగ్ అశ్విన్ మేకింగ్ తోడవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఎట్టకేలకు ఈ శుక్రవారం ‘సింగ్ గీతం’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి అందరి అంచనాలనూ ఈ సినిమా అందుకున్నదా? అనే విషయం తెలియాంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
అప్పుడే జైలు నుంచి విడుదలైన ప్రతాప్(ఆయాన్) తన తండ్రి తన పేరు రాసిన ఆస్తిని దక్కించుకునేందుకు అగ్రిమెంట్ పేపర్లను తీసుకొని కుబేరపురం గ్రామానికి వెళ్తాడు. అదో మిస్టీరియస్ విలేజ్. అక్కడ ఓ కొండ ఉంటుంది. ఆ కొండలో కుబేరుడి గుహ కూడా ఉంటుంది. ఆ ప్రాంత జనం కుబేరుడ్ని పూజిస్తుంటారు. ఎడారిని తలపించేలా ఉన్న ఆ ఊరిలో ఒకేఒక భారీ వృక్షం ఉంటుంది. ఆ చెట్టంటే ప్రాణం ఇచ్చే గౌరీ(అహల్య)ని కలుసుకుంటాడు ప్రతాప్. ఆమె ద్వారా సెల్ఫిష్ మైనింగ్ బిజినెస్ విమెన్ రేణు(షాలిని)ని కలుస్తాడు. ఆ ప్రాంతమంతా బంగారు గని అని రేణు మాటల ద్వారా తనకు అర్థమవుతుంది. రేణు, ఆమె తండ్రి(బెనర్జీ) ఇద్దరూ కలిసి తన పేరున్న స్థలంలో కూడా మైనింగ్ జరిపి, అక్కడున్న బంగారాన్ని కూడా దోచుకోవాలని చూస్తున్నారనే విషయం ప్రతాప్‌కి తెలుస్తుంది. ఉన్నట్టుండి భాగస్తుడైన ప్రతాప్ రావడంతో, చేసేది లేక రేణు, రేణు తండ్రి తమ వ్యాపారంలో ప్రతాప్‌ని కూడా భాగస్తుడిగా చేర్చుకుంటారు. అప్పటికే ఆ ప్రాంతం అంతా మైనింగ్ జరిపేసి ఉంటుంది. ఒక్క వృక్షం ఉన్న ప్లేస్‌లో మాత్రం మైనింగ్ జరిగి ఉండదు. దాంతో అక్కడ మైనింగ్ చేద్దామని ప్రతాప్ సూచించడంతో, అహల్య వద్దని వారిస్తున్నా, ఆ భారీ వృక్షాన్ని కూలగొడతారు. దీంతో గౌరీ తీవ్ర మనస్తానికి గురవుతుంది. ఆ బాధలోనే అనుకోకుండా కుబేర గుహలోకి వెళ్తుంది. అక్కడ దేవుడ్ని నిలదీస్తుంది. నీతిలేని జనానికి మాట ఎందుకిచ్చావ్? అని ప్రశ్నిస్తుంది. అబద్ధాలతో బతికే బతుకూ ఓ బతుకేనా? అంటూ నిలదీస్తుంది. దాంతో ఊహించని విధంగా ఆ ఊరి జనమందరికీ మాట కాస్తా పాటై కూర్చుంటుంది. అందరూ నిజాలు చెప్పేస్తుంటారు. మాటను పాటలా పాడుతూ అంతా విచిత్రంగా, విడ్డూరంగా ఫీలవుతుంటారు? ఆ జనానికి మళ్లీ మాట ఎలా వచ్చింది? కుబేరుడి శాపం వల్ల ఆ ప్రాంతంలో ఎలాంటి పరిణామాలు తలెత్తాయి? అనేది మిగతా కథ.
విశ్లేషణ
సింగీతం శ్రీనివాసరావు అంటేనే ఓ ప్రయోగశాల. మాటల్లేకుండా ‘పుష్పక విమానం’ చేసిన ఆయన, మాటే పాటైతే అంటూ మరో కొత్త ప్రయోగానికి తెర లేపుతూ చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఇది అన్ని సినిమాల్లాంటి సినిమా కాదు. నాగ్ అశ్విన్ చెప్పినట్టు ఇలాంటి సినిమాను ప్రపంచం నిజంగానే చూడలేదు. అది నిజంగా వందశాతం నిజం. అసలు ఇలాంటి ఆలోచన రావడమే నిజంగా గొప్ప విషయం. ఈ విభిన్నమైన కథ ద్వారా చాలా గొప్ప విషయాలను స్పృశించారు సింగీతం. పచ్చని చెట్టు బంగారం కంటే మిన్న అనే సందేశం ఈ సినిమాతో ఆయనిచ్చారు. పర్యావరణం గొప్ప తనాన్ని తెలిపేలా ఈ సినిమా తీశారు. సింగీతం విజన్‌ని, తెరపైకి తెచ్చేందుకు నాగ్ అశ్విన్ పడిన కష్టం అణువణువునా కనిపించింది. ఈ ప్రయోగం జనానికి ఎక్కితే, ఇది కచ్ఛితంగా మరో గొప్ప ప్రయత్నం అవుతుందని చెప్పక తప్పదు. కమర్షియల్‌గా ఆలోచించకుండా, ఒక గొప్ప ప్రయత్నాన్ని జనం ముందుకు తీసుకొచ్చిన నాగ్అశ్విన్ని ఈ విషయంలో అభినందించకుండా ఉండలేం. ‘సింగ్ గీతం’ సినేరియానే కొత్తగా ఉంది. తెరపై ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడంలో మేకర్స్ సఫలీకృతులయారు. ఈ సినిమా ద్వారా పరిచయమైన కొత్త వారంతా చక్కగా అభినయించి, పరిధిమేర తమ పాత్రలను రక్తికట్టించారు.
సాంకేతికంగా
ఈ సినిమా విషయంలో సింగీతం శ్రీనివాసరావు తర్వాత చెప్పుకోవాల్సింది దేవిశ్రీ ప్రసాద్ గురించే. ఆయనకు ఈ సినిమా ఓ సవాల్. ప్రతి మాటా పాటగా వినిపించాలి. ప్రతి నటుడి వద్ద నుంచి శృతిబద్ధంగా పాట తీసుకోవాలి. ఈ విషయంలో దేవిశ్రీప్రసాద్ గట్టిగానే శ్రమించారు. అయితే.. ఈ క్రమంలో కొందరు నటీనటుల రాగశైలి ఇబ్బందిగా అనిపించింది. మొత్తంగా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేశారు దేవిశ్రీ. కెమెరా వర్క్ కూడా చాలా బావుంది. ఆర్ట్ డైరెక్టర్ వేసిన సెట్లు కూడా బావున్నాయి. ఓ కొత్త వాతావరణం తెరపై క్రియేట్ చేశారు. మొత్తంగా సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంది. ప్రయోగాత్మక చిత్రాలు ఇష్టపడే వాళ్లకు ‘సింగ్ గీతం’ కచ్ఛితంగా కొత్తగా ఉంటుంది. రొడ్డకొట్టుడు మసాలా సినిమాలను ఇష్టపడేవారు ఈ సినిమా చూడకుండా ఉండటమే మంచిది.
బలాలు
కాన్సెప్ట్, నటీనటుల నటన, దేవిశ్రీ స్వరాలు..
బలహీనతలు
ఎడిటింగ్, కొందరు నటీనటుల గానశైలి ఇబ్బందిగా అనిపించడం..
రేటింగ్ : 2.5/5