ఎదురులేని సూపర్‌స్టార్‌గా కన్నడ సినీరంగాన్ని ఏలుతున్నారు శివరాజ్‌కుమార్. దాదాపు 50ఏండ్ల నట ప్రయాణం ఆయనది. ఎన్నో గొప్ప పాత్రలతో కన్నడ ప్రేక్షకుల మన్ననలు అందుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా కితాబులందుకున్న శివరాజ్‌కుమార్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. త్వరలో రానున్న రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారాయన. జూన్ 4న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం శివరాజ్‌కుమార్ విలేకరులతో ముచ్చటించారు. ఆ వివరాలివి.
‘పెద్ది’ గొప్ప కథ. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. నటుడిగా నాకెంతో సంతృప్తినిచ్చిన సినిమా ‘పెద్ది’. ఇందులో నా పాత్ర పేరు ‘గౌర్నాయుడు’. ఆ పాత్రకు ఓ ఉద్దేశం ఉంటుంది. ఇందులో పెద్ది, గౌర్నాయుడు మధ్య అనుబంధం ఆసక్తికరంగా ఉంటుంది. వారిద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయత, ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఈ కథలో ‘పెద్ది’ ప్రయాణం అద్భుతం. నా పాత్ర తనకు కోచ్‌లా ఉంటుంది.
‘పెద్ది’తో రామ్‌చరణ్ నేషనల్ అవార్డ్ అందుకుంటాడని నా నమ్మకం. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతం. కష్టపడి, ఏకాగ్రతతో, దాదాపు రెండేళ్ల పాటు ఆ పాత్ర కోసం పూర్తిగా ఒదిగిపోయి అంకితభావంతో పనిచేశాడు రామ్‌చరణ్. ఆయన పాత్రతో పాటు నా పాత్ర, జగపతిబాబు పాత్ర, అలాగే మిగతా పాత్రలన్నింటినీ బుచ్చిబాబు గొప్పగా డిజైన్ చేశాడు. రత్నవేల్ ఇచ్చిన విజువల్స్ అయితే మెస్మరైజ్ చేస్తాయి.
బుచ్చిబాబు ఫెంటాస్టిక్ డైరెక్టర్. ఆయన మేకింగ్, టేకింగ్ సూపర్. కథకు ఏం అవసరమో అదే తీశారు. ఆయన స్టోరీ టెల్లింగ్ అద్భుతం. ఈ కథలో పలు క్రీడలుంటాయి. ప్రతి క్రీడా కథతో బలంగా అనుసంధానమై ఉంటుంది. ముఖ్యంగా ైక్లెమాక్స్ ఉత్కంఠకు గురిచేస్తుంది. ఆ ఎమోషన్ని బిగ్ స్క్రీన్‌పై ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. నిర్మాత వెంకట సతీశ్ కిలారు ఏ విషయంలోనూ రాజీపడలేదు. ప్రస్తుతం ‘గుమ్మడి నరసయ్య’, ‘జైలర్ 2’ సినిమాలు చేస్తున్నాను. మంచి కథలు వస్తే తెలుగులో సినిమాలు చేస్తాను.