‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ సినిమాతో హీరోయిన్గా పరిచమైన తెలుగు అమ్మాయి శివానీ నగరం. మొదటి సినిమాతోనే
ప్రేక్షకుల మనసులు దోచుకుంది. రెండో సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో సూపర్ హిట్ కొట్టేసింది. అందులో ఆమె పోషించిన కాత్యాయని పాత్ర బాగా హైలెట్ అయింది. ముచ్చటగా మూడో చిత్రం ‘హే బలవంత్’లోనూ మెరిసి మరో
విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా శివానీ పంచుకున్న కార్వాన్ కబుర్లు ఇవి..
నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకున్నాను. పెద్దాయ్యాక కొన్నిరోజులు కూచిపూడి డ్యాన్స్ టీచర్‌గా పనిచేశాను. సినిమాల్లోకి రాకమందు పాకెట్ మనీ కోసం నా తమ్ముడితో కలిసి హౌస్ ఈవెంట్లు, లైవ్ బ్యాండ్స్, బర్త్‌డే పార్టీలు లాంటి ఈవెంట్లలో పాటలు పాడేదాన్ని. అలా వచ్చిన డబ్బును ఇద్దరం పంచుకునేవాళ్లం. నా మొదటి సినిమాలో పాట పాడాలనుకున్నా కుదరలేదు. నేనే నటించే సినిమాలో ఎప్పటికైనా ఓ గీతాన్ని ఆలపిస్తాను.
ఈ మధ్య సోషల్‌మీడియాలో చాలామంది ఒక విషయాన్ని పూర్తిగా వినకుండానే జడ్జ్ చేస్తున్నారు. నా విషయంలోనూ అదే జరిగింది. ఓ ఇంటర్వ్యూలో ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతూ.. కేదార్నాథ్, రామకోటి రాయడం, షిర్డీ, తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం గురించి చెప్పుకొచ్చాను. శ్రీవారి దర్శనం విషయంలో నా అనుభూతిని పంచుకున్న
తీరును అపార్థం చేసుకున్నారు. ఆ విషయంలో క్షమాపణలు కూడా చెప్పాను.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను. ఫొటోలు, సినిమా అప్డేట్లను షేర్ చేస్తుంటాను. ప్రకృతిని చూస్తే నన్ను నేను మర్చిపోతా. అందుకే తరుచూ రోడ్ ట్రిప్‌లకు వెళ్తుంటా. ఫంక్షన్లు, పండుగలకు చీరకట్టు, లెహంగాల్లో సంప్రదాయంగా తయారవుతాను.
‘అంతర్గత’ షార్ట్‌ఫిల్మ్‌తో నటిగా అడుగులు వేశాను. ఆ తర్వాత ‘మిస్టర్ గర్ల్‌ఫ్రెండ్’ వెబ్‌సిరీస్‌లోనూ నటించాను. ‘అంబాజీపేట
మ్యారేజీ బ్యాండు’లో అవకాశం ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఆడిషన్‌కు వెళ్లాను. స్నేహితురాలి పాత్ర కోసం వెళితే ఏకంగా హీరోయిన్నే చేశారు.
రెండో సినిమాకే అవార్డు రావడమనేది చాలా సంతోషించే విషయం. 2025 సంవత్సరానికి గాను ప్రదానం చేసిన ‘కళావేదిక ఎన్టీయార్’ అవార్డులలో ఏకంగా ఆరు పురస్కారాలు ‘లిటిల్ హార్ట్స్’ చిత్రమే గెలుచుకున్నది.
అందులో నాకు ఉత్తమ నటి అవార్డు దక్కడం నా సినీ కెరీర్లో తొలిమెట్టుగా భావిస్తున్నాను.
తెలుగు అమ్మాయినే అయినా ఇతర భాషల్లోనూ సినిమాలు చేయాలనే కోరిక ఉంది. అందుకే తమిళంలో ఎంట్రీ ఇస్తున్నాను. శివరాజ్ కుమార్ లాంటి సీనియర్ యాక్టర్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. గతంలో శ్రీదివ్య, అంజలి, బిందుమాధవి, ఆనంది లాంటి తెలుగమ్మాయిలు తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చున్నారు.
నాదీ అదే బాట.