అంబాజీపేట మ్యారేజి బ్యాండు, లిటిల్ హార్ట్స్ చిత్రాలతో యువతరం మనసులు దోచింది తెలంగాణ ముద్దుగుమ్మ శివానీ నాగారం. ఇంట ఎట్లాగూ గెలిచింది. ఇక రచ్చ గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది ఈ అందాలభామ. తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ, విత్ లవ్ చిత్రాల ద్వారా అటు నటుడిగా, ఇటు దర్శకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ జీవంత్ హీరోగా, గౌతమ్ శివరామ్ దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న చిత్రంలో శివానీ నాగారం కథానాయికగా ఎంపికైంది. యోగలక్ష్మి ఇందులో మరో కథానాయిక.
డ్రామా కంపెనీ సమర్పణలో ఎ.బాలమురుగన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తమిళంలో నేను చేస్తున్న తొలి సినిమా ఇది. నాకు చాలా ప్రత్యేకం. అభిషేక్‌తో కలిసి నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. తనెంతో ప్రతిభావంతుడు. ఇక శివరాజ్కుమార్సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే గొప్ప వరం’ అంటూ ఆ వీడియోలో శివానీ నాగారం పేర్కొన్నది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానున్నది.