Shiva Nirvana | ‘ఇరుముడి’ సినిమాతో మరోసారి దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న శివ నిర్వాణ.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎవరితో చేయబోతున్నారనే చర్చ టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మరోవైపు నటుడు ధనుష్.. ఇక వీరిద్దరితో పాటు అక్కినేని నాగచైతన్య పేరు కూడా శివ నిర్వాణ నెక్స్ట్ ప్రాజెక్ట్ రేసులో వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎప్పటినుంచో ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శివ నిర్వాణ ఎమోషనల్ స్టోరీటెల్లింగ్, ఆయన దర్శకత్వ ప్రతిభపై సూర్యకు మంచి అభిప్రాయం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సూర్య ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే పక్కా కథ సిద్ధమైతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సైతం శివ నిర్వాణ దర్శకత్వ ప్రతిభపై ఆసక్తి చూపుతున్నట్లు చర్చ సాగుతోంది. ‘ఇరుముడి’ చిత్రాన్ని చూసిన ధనుష్.. అందులో శివ నిర్వాణ పనితీరును మెచ్చుకున్నారని సమాచారం. తన ఇమేజ్‌కు, నటనకు తగ్గట్టుగా బలమైన కథ సిద్ధమైతే కలిసి పనిచేయడానికి ఆయన సానుకూలంగా ఉన్నట్లు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరితో పాటు అక్కినేని నాగచైతన్యతో శివ నిర్వాణ మరోసారి చేతులు కలిపే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘మజిలీ’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ సినిమా.. శివ నిర్వాణ-నాగచైతన్య కాంబినేషన్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
వీరిద్దరి మధ్య ఉన్న మంచి అనుబంధం, సాన్నిహిత్యం కారణంగా మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. సరైన కథ దొరికితే నాగచైతన్యతో మరో సినిమా చేయడానికి శివ నిర్వాణ ఆసక్తి చూపవచ్చని టాక్. అటు పాన్-ఇండియా స్టార్ సూర్య, విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, ఇటు నాగచైతన్య.. ఇలా ముగ్గురు స్టార్ హీరోల పేర్లు శివ నిర్వాణ తదుపరి సినిమా విషయంలో వినిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.అయితే శివ నిర్వాణ తన వద్ద ఉన్న కథల్లో ఎవరికి ఏ కథ సరిగ్గా సరిపోతుందో చూసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ముగ్గురు హీరోల్లో ఎవరితో ఆయన ముందుగా చేతులు కలుపుతారు? ఎవరి కోసం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.