Sharwanand Biker Promotions | టాలీవుడ్ హీరో శర్వానంద్ తాజాగా తన కెరీర్లో ఎదురైన ఒక చేదు అనుభవం గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నటించిన ‘బైకర్’ (Biker) సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నటి అమలతో కలిసి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘జాను’ (Jaanu) సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. “నాకు ‘జాను’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం చాలా పెద్దది. ఆ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో ప్రాణాలకు తెగించి స్కైడైవింగ్ నేర్చుకుంటుండగానే ఆ యాక్సిడెంట్ జరిగింది. నా భుజం ఎముక పూర్తిగా విరిగిపోయింది, అది చాలా క్లిష్టమైన సర్జరీ. అయితే, ఆ సమయంలో ఆ ప్రమాదం గురించి పరిశ్రమలో గానీ, బయట గానీ ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. ప్రాణాలకు తెగించి సాహసాలు చేసినా కనీస గుర్తింపు లేదా సానుభూతి లభించకపోవడం అప్పుడు చాలా బాధ అనిపించింది. నేను అంత తక్కువ వాడినా? అని కూడా అనిపించింది” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.
2019లో తమిళ హిట్ చిత్రం ’96’ రీమేక్‌గా వచ్చిన ‘జాను’ కోసం శర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ శిక్షణ తీసుకున్నారు. ల్యాండింగ్ సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కోలుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. తాజాగా ఆయన నటించిన ‘బైకర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండటంతో, ఈ సక్సెస్ మీట్లో ఆయన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.