Satyadev | విలక్షణ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు పెంచగా, ట్రైలర్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన సత్యదేవ్, మహేష్ బాబు అందించిన సహకారం గురించి ఎంతో భావోద్వేగంగా ప్రస్తావించారు. ‘రావు బహదూర్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, తెలుగు సినిమాపై తమ ప్రేమను వ్యక్తపరిచే ఒక అందమైన ప్రేమలేఖ లాంటిదని ఆయన అన్నారు.
ఒక ప్రేమలేఖ రాసిన తర్వాత దాన్ని మనకు అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు చదివి విలువైన సూచనలు ఇచ్చినట్లే, ఈ సినిమా విషయంలో మహేష్ బాబు అండగా నిలిచారని సత్యదేవ్ తెలిపారు. ట్రైలర్‌కు తన వాయిస్ ఓవర్ అందించడం ద్వారా సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని ఆయన ప్రశంసించారు. అంతేకాదు, ఇది నిజంగా తెలుగు సినిమాకు రాసిన లవ్ లెటర్ అని మహేష్ బాబు చెప్పిన మాటలు తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చాయని సత్యదేవ్ వెల్లడించారు. ఈ సినిమా తన నట జీవితంలో కీలక మలుపు అవుతుందనే నమ్మకం తనకు ఉందని సత్యదేవ్ చెప్పారు.
నా జీవితాన్ని ‘రావు బహదూర్’కు ముందు, ‘రావు బహదూర్’ తర్వాత అనేలా ఈ సినిమా మార్చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అంటూ తన కాన్ఫిడెన్స్‌ను వ్యక్తం చేశారు. ‘కేరాఫ్ కంచరపాలెం’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రాన్ని సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే కథ, కథనం, విజువల్స్ ఆసక్తికరంగా ఉండబోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రంలో సత్యదేవ్ సరసన దీపా థామస్ కథానాయికగా నటించగా, చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు.జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రావు బహదూర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. అయితే ట్రైలర్‌కు వచ్చిన స్పందన, మహేష్ బాబు మద్దతు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.