‘ఒక చిన్న పాత్రలో డైలాగ్ చెప్పేందుకు రోజుల తరబడి వేచి చూశాను. అప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదల నాలో ఏర్పడింది. శాసనసభ చిత్రంతో నాకు అలాంటి పేరు దక్కుతుందని నమ్ముతున్నాను’ అన్నారు హీరో ఇంద్రసేన. ఆయన కథానాయకుడిగా ఐశ్వర్య రాజ్ నాయికగా నటించిన చిత్రం ‘శాసనసభ’. సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్, రాజేంద్రప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మిస్తున్నారు. వేణు మడికంటి దర్శకుడు. ఈ నెల 16న రిలీజ్‌కు రెడీ అవుతున్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపారు హీరో ఇంద్రసేన.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఓ సామాన్యుడు ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అనేది మా సినిమా ఇతివృత్తం. నేను ఆ సామాన్యుడి పాత్రలో కనిపిస్తాను. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులుపై కొన్ని విమర్శనాత్మక డైలాగ్స్ వున్నాయి. డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకునే రాజకీయనాయకులు, డబ్బు తీసుకుని ఓటువేసే ఓటర్లు ఆలోచించే విధంగా సంభాషణలు వుంటాయి. పక్కా కమర్షియల్ సినిమా కథలో అని బాగా కుదిరాయి.
రవిబస్రూర్ ‘కేజీఎఫ్’ తరువాత మా సినిమాకు పని చేయడం గర్వంగా ఉంది. నేపథ్య సంగీతం ‘కేజీఎఫ్’ స్థాయికి ఏ మాత్రం తగ్గదు. ఇందులో నా పాత్ర సందేశాత్మకంగా వుంటుంది. ‘అవతార్’, మా సినిమా ఒకే రోజున విడుదలవుతున్నది.‘అవతార్’ మూవీ విడుదల ఓ పండగ వాతావరణంలా ఉంటుంది. ఈ పండగ రోజు మా సినిమా కూడా థియేటర్లో ఉండటం ఆనందంగా వుంది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాను. అవి యాక్షన్ సీక్వెన్స్‌లో ఉపయోగపడ్డాయి. ఈ సినిమా తరువాత నాకు యాక్షన్ హీరోగా మంచి పేరు వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అదృష్టం కూడా తోడవ్వాలి.
‘సైరా’లో యుద్ధవీరుడిగా
నటన పట్ల ఆసక్తితో కొన్నేండ్ల కిందట చిత్ర పరిశ్రమకు వచ్చాను. దర్శకుడు సురేందర్ రెడ్డి తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అలా ‘కిక్ 2’, ‘ధృవ’, ‘సైరా’ చిత్రాల్లో మంచి క్యారెక్టర్స్ చేశాను. సైరాలో యుద్ధ వీరుడి పాత్రలో నటించాను. ఆ తర్వాత నాకు గుర్తింపు తెచ్చే పాత్రలేవీ దక్కలేదు. దాంతో సినిమాల నుంచి చిన్న విరామం తీసుకున్నాను. ఇకపై నటిస్తే హీరోగానే తెరపై కనిపించాలి. మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి అనుకున్నాను.
ఆ క్రమంలో స్నేహితుడు రాఘవేందర్ రెడ్డి ద్వారా శాసనసభ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. నా హెయిర్ ైస్టెల్, బియర్డ్ చూసి కన్నడ స్టార్ యష్లా ఉంటానని చెబుతారు. నేను కావాలని ఇలా రెడీ అవలేదు. ‘సైరా’లో క్యారెక్టర్ కోసం దర్శకుడు చెప్పినట్లు గడ్డం పెంచాను. అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ సినిమా ఇంత భారీగా తెరకెక్కడానికి కారణం నిర్మాత, నా మిత్రుడు షణ్ముగం. కొత్త హీరో అయినా ఎక్కువ బడ్జెట్ పెట్టాడు. పేరున్న నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇచ్చాడు.