Sanjay Dutt | భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ రికార్డుల గురించి చర్చ మొదలైతే అందులో సౌత్ సూపర్స్టార్ల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ ట్రెండ్ మధ్య బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మూడు 1000 కోట్ల క్లబ్ చిత్రాల్లో నటించిన ఏకైక భారతీయ నటుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.సంజయ్ దత్ ఈ అరుదైన రికార్డును సాధించడంలో ఆయన ఎంపిక చేసిన విభిన్న పాత్రలే ప్రధాన కారణంగా నిలిచాయి. హీరోగానే కాకుండా విలన్, సపోర్టింగ్ రోల్స్, గెస్ట్ అప్పియరెన్స్లతోనూ భారీ విజయాల్లో భాగస్వామి కావడం ఆయన వెర్సటిలిటీకి నిదర్శనం.
ఈ రికార్డు ప్రయాణం కెజిఎఫ్ చాప్టర్ 2తో ప్రారంభమైంది. యష్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో ‘అధీర’ పాత్రలో సంజయ్ దత్ నటనకు విశేష స్పందన లభించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంజయ్ దత్‌కు పాన్ ఇండియా ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించిన సంజయ్ దత్, మరో 1000 కోట్ల క్లబ్ చిత్రంలో భాగమయ్యారు. కొద్ది సేపే తెరపై కనిపించినప్పటికీ ఆయన పాత్రకు మంచి స్పందన వచ్చింది.
ఇక దళపతి విజయ్ నటించిన లియోలో కీలక పాత్ర పోషించి మరో భారీ విజయాన్ని అందుకున్నారు. తాజాగా రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ 2 1000 కోట్ల క్లబ్లో చేరడంతో సంజయ్ దత్ ఖాతాలో మూడో భారీ రికార్డు చేరింది. అయితే షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో రెండు 1000 కోట్ల క్లబ్ సినిమాలతో సత్తా చాటినప్పటికీ, మూడు సినిమాలతో సంజయ్ దత్ అగ్రస్థానంలో నిలిచారు. ఇదే సమయంలో రణ్వీర్ సింగ్ కూడా వరుసగా ‘ధురంధర్’, ‘ధురంధర్ 2’ చిత్రాలతో భారీ విజయాలు సాధిస్తూ తన స్థానాన్ని బలపరుచుకుంటున్నారు. ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం, పెద్ద హీరోల సినిమాల్లో సంజయ్ దత్ ఉండటం ఆ చిత్రాల హైప్‌ను మరింత పెంచుతోంది. తన ప్రత్యేకమైన వాయిస్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఆయన మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు.
సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత బలంగా దూసుకెళ్తున్న సంజయ్ దత్, మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నారు. ఆయన ప్రయాణం ఇప్పుడు యువ నటులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది.