Rakasa Movie | ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకాస’. జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ బుధవారం ఘనంగా విడుదలైంది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్, కామెడీ, ఫాంటసీ అంశాల కలయికతో రూపొందింది. అమెరికా నుంచి ఒక కుర్రాడు (సంగీత్ శోభన్) తన ఊరికి తిరిగి వచ్చినప్పుడు, అక్కడి ఒక పాడుబడ్డ కోట వెనుక ఉన్న మిస్టరీలో ఎలా చిక్కుకున్నాడనేది ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. ఊరు మొత్తం కలిసి ఒక బ్రహ్మరాక్షసుడికి హీరోను బలి ఇవ్వాలని చూడటం, ఆ విపత్కర పరిస్థితుల నుంచి హీరో తన కామెడీ టైమింగ్‌తో ఎలా తప్పించుకున్నాడనేది సినిమాలో ప్రధానాకర్షణగా నిలవనుంది.
వెన్నెల కిశోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న నిహారిక, ఈ ‘రాకాస’తో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.