‘భీమ్లానాయక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నాయిక సంయుక్త మీనన్. ‘బింబిసార’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ తార..ధనుష్ సరసన ‘సార్’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపింది నాయిక సంయుక్త మీనన్.
టీచర్‌గా ఆకట్టుకుంటా
తెలుగులో నేను మొదట అంగీకరించిన సినిమా ‘బింబిసార’. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్‌తో ‘విరూపాక్ష’ చిత్రాన్ని ఒప్పుకున్నాను. ఇంతలో ‘భీమ్లానాయక్’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడు నా నటన బాగుందని అనుకుని సితార సంస్థలో మరో ఆఫర్ ఇచ్చారు. అదే ‘సార్’ సినిమా. దర్శకుడు వెంకీ కథ చెప్పగానే ఈ సినిమా తప్పకుండా చేయాలని అనుకున్నాను.
కథ బాగుండటమే కాదు అందులో నా పాత్ర కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. విద్యా వ్యవస్థ నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో నేను ఒక పల్లెటూరి అమ్మాయిని. జువాలజీ టీచర్‌గా పనిచేస్తుంటాను. టీచర్ చీరకట్టు ఎలా ఉంటుంది, వాళ్లు ఎలా మాట్లాడుతారు అనేది పరిశీలించాను. క్యారెక్టర్లో నటించే విషయమై దర్శకుడు, రచయితతో ఎక్కువసార్లు చర్చించాను. కొన్ని పాత్రలు చేసేందుకు ప్రిపరేషన్ కావాలి. కానీ మరికొన్ని క్యారెక్టర్స్ సహజత్వం కోసం సెట్లో అప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది. ఇందులో కొంతవరకే హోమ్‌వర్క్ చేశా. మిగతాది షూటింగ్ స్పాట్లో నటించిందే.
అదంతా అదృష్టం
‘సార్’ చిత్ర నేపథ్యం విద్యా వ్యవస్థ గురించి అయినా పూర్తి సందేశాత్మకంగా సినిమా ఉండదు. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటూనే సొసైటీలో ఉన్న ఓ సమస్యను చూపించాం. ధనుష్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయన అభిమానిని నేను. తను మంచి నటుడే కాక పెద్ద స్టార్ కూడా. తన క్యారెక్టర్‌కు ఎంతవరకు నటించాలో కొలిచినట్లు ఎక్కువ తక్కువ కాకుండా అంతే చేస్తాడు.
అతని నుంచి ఈ విషయం నేర్చుకున్నాను. కెరీర్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్, రానా, ధనుష్, సాయిధరమ్ తేజ్ వంటి పేరున్న హీరోలతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తుంటా. అయితే నాకు వచ్చే ప్రతి అవకాశంలో ముందు కథ ఎలా ఉంది, అందులో నా పాత్రకు ఉన్న ప్రాధాన్యత ఎంత అనేది ఆలోచిస్తాను. కథ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి. వాటికి స్టార్ బలం కూడా తోడైతే సినిమాలు మరింత చేరువవుతాయి. స్టార్స్‌తో కలిసి నటిస్తే వాళ్ల అభిమానులు మనల్నీ ఇష్టపడతారు.
నటిగా పేరు తెచ్చుకోవాలి
సినిమాను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. జీవితం ఇటు మలుపు తీసుకుంది. ఇప్పుడు సినిమానే జీవితం అయిపోయింది. తెలుగులో అవకాశాలు బాగా వస్తున్నాయి. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతం ‘విరూపాక్ష’ సినిమా చివరి దశ చిత్రీకరణలో ఉంది. ‘బింబిసార 2’ గురించి ఆ దర్శక నిర్మాతలు ప్రకటన చేస్తారు.