‘సమాజంలో నెలకొన్న సమస్యల పట్ల గళాన్ని వినిపించడానికి సినిమా నాకో చక్కటి వేదికగా ఉపయోగపడుతున్నది’ అని చెప్పింది సాయిపల్లవి. సహజత్వం మేళవించిన వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా ప్రతిభను చాటుకుంటున్నదామె. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’. నాగచైతన్య హీరోగా నటించారు. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో సాయిపల్లవి పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
శేఖర్ కమ్ముల చెప్పిన ఈ కథలో మిమ్మల్ని ఏ అంశాలు ఆకట్టుకున్నాయి?
సీనియర్స్, జూనియర్స్ అనే భేదాలు లేకుండా ఎవరికి కథ వినిపించినా ‘మీకు నచ్చిందా?రియల్‌లైఫ్‌కు కనెక్ట్ అయ్యిందా’ అని శేఖర్ కమ్ముల అడుగుతుంటారు. మనం చెప్పే సమాధానం సంతృప్తినిస్తేనే జర్నీని కొనసాగిస్తారు. ‘లవ్‌స్టోరి’కథను చదవమని నాకు పంపించారు. కథతో పాటు పాత్రల్ని ఆయన మలచిన విధానం నచ్చడంతో సినిమాను అంగీకరించాను.
‘ఫిదా’ లో చేసిన భానుమతితో పోలిస్తే ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎంతవరకు భిన్నంగా ఉంటుంది?
ఇందులో నేను మౌనిక అనే యువతిగా కనిపిస్తా. ఈ పాత్రకు భానుమతితో ఎలాంటి పోలికలు ఉండవు. రెండు పాత్రల చిత్రణలు, వాటి తాలూకు ప్రయాణం పూర్తి భిన్నంగా ఉంటుంది. పెళ్లి తర్వాత తన కుటుంబాన్ని వదిలి ఎందుకు వెళ్లాలని తండ్రితో పాటు సమాజాన్ని ప్రశ్నించే అమ్మాయిగా ‘ఫిదా’లో కనిపించా. ఇందులో తన కలల సాధన కోసం కృషిచేసే ఆత్మవిశ్వాసం మెండుగా కలిగిన అమ్మాయిగా నవ్యరీతిలో నా పాత్ర ఉంటుంది. ఎవరి ప్రోత్సాహం లేకపోయినా ధృడచిత్తం ఉంటే ఏదైనా సాధించగలమని నమ్మే అమ్మాయిగా స్ఫూర్తివంతంగా సాగుతుంది.
ప్రచార చిత్రాలు చూస్తుంటే నృత్యప్రధానంగా సాగే సినిమా అనిపిస్తోంది?
డ్యాన్స్ అనేది కథలో ఓ అంతర్భాగంగానే ఉంటుంది తప్ప అదే ప్రధాన పాయింట్ కాదు. సమాజంలోని అసమానతల్ని చర్చిస్తూ సాగే ప్రేమకథా చిత్రమిది. జుంబా ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకుడిగా నాగచైతన్య కనిపిస్తారు. బీటెక్ పూర్తిచేసుకొని ఉద్యోగాన్వేషణ కోసం నగరానికి వచ్చిన అమ్మాయిగా నా పాత్ర సాగుతుంది. వారిద్దరి జీవనగమనంలోఎదురైన కష్టాల్ని సీరియస్‌గా కాకుండా వినోదాత్మక పంథాలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఆవిష్కరించారు. నవ్విస్తూనే ఆ సన్నివేశాలు ఆలోచనను రేకెత్తిస్తాయి. నిత్యజీవితంలో మన కళ్ల ముందు కనిపించే అణచివేతకు పరిష్కారాల్ని సినిమాలో చూపించడం లేదు. కానీ వాటిపై ప్రశ్నలు సంధించడమే కాకుండా వివక్షకు లోనైన వారి గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు.
మహిళల పట్ల కనిపించే లింగవివక్షను గురించి మీ అభిప్రాయమేమిటి? ఈ వివక్ష కారణంగా మీరు ఎప్పుడైనా ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయా?
నేను ప్రత్యక్షంగా ఎదుర్కోకపోయినా నా కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటు చాలా మంది మహిళలు నిజజీవితంలో ఎన్నో రకాలుగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. తమకు ఎదురైన సమస్యల్ని కొందరు తేలికగా తీసుకుంటుంటారు. అమ్మాయిలందరికి ఎదురయ్యే సాధారణ ఇబ్బందులేనని, వాటిని బయటకు వ్యక్తం చేయడం ఎందుకనే అలసత్వం కనిపిస్తుంటుంది. ఈ ఆలోచన విధానంలో నిదానంగా మార్పులొస్తున్నాయి. తమకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడటానికి ధైర్యంగా మహిళలు ముందుకొస్తున్నారు. ఈ సమస్యల్ని సరిదిద్దుతూ ఎలాంటి అసమానతలు లేని సమాజాన్ని సృష్టించాలంటే ఇంకో వందేళ్లయినా పడుతుంది.
సోదరిగా నటించడం ఇష్టం లేకనే చిరంజీవి గారి సినిమాను తిరస్కరించారా?రీమేక్‌లో నటించవద్దనే ఆలోచనతో వదులుకున్నారా?
కథతో పాటు నా క్యారెక్టర్ బాగుంటే సోదరిగా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రీమేక్ విషయంలో ఉన్న భయాల వల్లే ఆ సినిమాలో అవకాశం వచ్చినా నటించలేకపోయాను. నిజాయితీగా ఉండటంలో తప్పులేదన్నది నా అభిప్రాయం. నచ్చకపోయినా కొన్ని సినిమాల్ని అంగీకరించి మనతో పాటు ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే మన అభిప్రాయమేమిటో చెప్పితే ఎదుటివారు మనల్ని సరిగా అర్థంచేసుకుంటారు.
నేను చేసే ప్రతి సినిమా, పాత్రల ద్వారా సమాజానికి ఏదో ఒక మంచి చెప్పాలనే తాపత్రయపడతాను. అరుదుగా అలాంటి అవకాశం దొరుకుతుంది. మహిళలపై జరిగిన అన్యాయాల గురించి వింటున్నప్పుడు తీవ్రమైన వేదనకు గురవుతుంటాను. కానీ మనసులో ఉన్న బాధను వ్యక్తం చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమస్యల పట్ల నా గళాన్ని వినిపించడానికి సినిమా నాకో చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. ఈ సినిమాలో కమర్షియల్ పంథాలో సమాజంలో ఉన్న తారతమ్యాలు, అసమానతల్ని అద్భుతంగా శేఖర్ కమ్ముల చూపించారు.
శేఖర్ కమ్ములతో రెండు సినిమాలు చేశారు? ఈ ప్రయాణంలో ఆయన నుంచి ఏ నేర్చుకున్నారు?
దర్శకుడిని కాబట్టి నేను చెప్పినట్లే అందరూ వినాలనే గర్వం శేఖర్ కమ్ములలో కించిత్ కూడా కనిపించదు. సమిష్టితత్వాన్ని బాగా నమ్ముతారు. తన వ్యక్తిత్వంలో ఉన్న నిజాయితీ సినిమాల్లో కనిపిస్తుంటుంది. సమాజంలో మార్పు రావాలనే ఆలోచనతో కథలను రాస్తుంటారు. అదే ఆయనలో నాకు చాలా నచ్చింది.
ఫిదాతో పాటు ఈ సినిమా కోసం తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ చేయడం ఎలాంటి అనుభూతిని పంచింది. ఈ సినిమాలోని ప్రధాన ఘట్టాలను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని పిప్రిలో తెరకెక్కించాం. అక్కడి ప్రజలు మమ్మల్ని తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగానే భావించారు. మాతో కలిసి సరదాగా ముచ్చటించారు. కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ వారిది. ఇతరులకు సాయం చేయడమే తప్పితే ఏది ఆశించేతత్వం వారిలో కనిపించలేదు. బాన్సువాడలో షూటింగ్ చేస్తున్న సమయంలో తాము తయారు చేసిన చీరను నాకు బహుమతిగా ఇచ్చారు. ఇక్కడి ప్రజల ప్రేమను చూసిన తర్వాత తెలంగాణలోనే స్థిరపడాలనే భావన కలిగింది.
తెలంగాణ యాసలో సహజత్వం కనిపించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఇదివరకు తెలంగాణ యాసతో ‘ఫిదా’లో డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా కోసం కష్టపడి తెలంగాణ యాసను నేర్చుకున్నా. ఇందులో ‘ఫిదా’ ఛాయలేవి లేకుండా కొత్తగా సంభాషణలు చెప్పడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నా.
రీమేక్ సినిమాలను చేయకూడదని రూల్ పెట్టుకున్నారా?
అలాంటి నియమాలేవి నేను విధించుకోలేదు(నవ్వుతూ). తొలినాళ్ల నుంచి రీమేక్‌లంటే నాకు భయం. మాతృకలో నటించిన తారల స్థాయికి మించి నటించాలి. అభినయంలో కొత్తదనాన్ని చూపించాలి. ఇప్పుడే రీమేక్‌లకు న్యాయం చేయగలం. వీటి వల్ల తెలియకుండానే మనపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ టెన్షన్‌ను అనుభవించడం కంటే స్ట్రెయిట్ సినిమాలు చేయడమే మంచిది. అందుకే రీమేక్‌లలో నటించే అవకాశాలు వచ్చినా తిరస్కరిస్తున్నాను.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలేవి?
నానితో ‘శ్యామ్‌సింగరాయ్’ సినిమా చేస్తున్నా. షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ బ్యాలెన్స్‌గా ఉంది. ‘విరాటపర్వం’ ఒకరోజు షూటింగ్ మాత్రమే మిగిలుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో మరికొన్ని సినిమాలను అంగీకరించా. మంచి కథ దొరికితే బాలీవుడ్‌లోనూ నటిస్తా. ఓ వెబ్‌సిరీస్‌ను అంగీకరించా.