‘ఇందులో నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మ పెట్టే రూల్స్ మధ్య పెరగడంవల్ల ప్రథమార్ధంలో బుద్ధిమంతుడైన విద్యార్థిగా కనిపిస్తా. ద్వితీయార్ధంలో ఉద్యోగస్తుడిగా కనిపిస్తా. ఇక్కడ నా రూల్స్ వల్ల తోటి ఎంప్లాయిస్ సఫరవుతుంటారన్నమాట’ అని తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘రూల్స్ రంజన్’. రత్నం కృష్ణ దర్శకుడు. ఏ.ఎం.రత్నం సమర్పిస్తున్న ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది.
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం విలేకరులతో ముచ్చటించాడు. ఇంకా చెబుతూ -‘అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా ఇది. ప్రథమార్ధం అంతా నవ్వులు. ద్వితీయార్ధం మొత్తం ఎమోషన్స్’ అని చెప్పారు కిరణ్ అబ్బవరం. ‘కథానాయిక నేహాశర్మ పాత్ర కథలో చాలా కీలకం. మాఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుటయింది. కాకపోతే ఇందులో ఓ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ పాటలో నటించడానికి కాస్త ఇబ్బందిపడ్డాను. ఇలాంటి పాటల్లో నటించడానికి మా సీనియర్ హీరోలు ఎంత ఇబ్బందిపడేవారో అర్థమైంది. కథను నమ్మి ఈ సినిమా చేశాను. దర్శకుడు రత్నంకృష్ణ పూర్తి క్లారిటీతో సినిమా తెరకెక్కించారు’ అని కిరణ్ అన్నారు.