Roshan Kanakala | టాలీవుడ్ యువ నటుడు రోషన్ కనకాల కథానాయకుడిగా ఓ వినూత్నమైన భారీ ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కింది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా, సరికొత్త సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వైవిధ్యభరితమైన కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో దిట్ట అయిన ప్రముఖ దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా, స్వయంగా సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ చిత్రంతో విజయ్ కె. కమిశెట్టి దర్శకుడిగా టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, ప్రేమ, వినోదం వంటి అన్ని రకాల వాణిజ్య అంశాలను కలగలిపి ప్రేక్షకులను ఒక సరికొత్త ఊహాజనిత ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ కథను సిద్ధం చేశారు.
ఈ చిత్రంలో రోషన్ కనకాల సరసన గహాజీ కథానాయికగా నటిస్తోంది. ఇక అత్యంత వైభవంగా జరిగిన ఈ ముహూర్పు వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉంచారు, త్వరలోనే టైటిల్ మరియు పూర్తి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. అన్ని హంగులు అద్దుకుని త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది.