Romanchakam | అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రెజెంటర్‌గా వ్యవహరించడం, ప్రమోషన్స్‌లో స్టార్ హీరో ప్రభాస్ పాల్గొనడంతో చిన్న సినిమా అయిన ‘రోమాంచకం’ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఏర్పడింది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను సందీప్ వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం.
కథ:
అన్వేష్ (సుమంత్ ప్రభాస్) తన స్నేహితులతో కలిసి ఒక డేటింగ్ యాప్‌ను ప్రారంభించాలనుకుంటాడు. ఆ యాప్ ట్రయల్స్‌లో భాగంగా అతనికి చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్ కుమార్) పరిచయమవుతుంది. కొద్ది రోజుల్లోనే ఇద్దరూ ప్రేమలో పడతారు. మైథిలి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అన్వేష్ చెన్నై వెళ్తాడు. కానీ మైథిలి అతన్ని కలవడానికి నిరాకరించి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, ఆన్లైన్లో అన్వేష్‌ను బ్లాక్ చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత సడన్‌గా అన్వేష్‌కు ఫోన్ చేసి తాను హైదరాబాద్ వస్తున్నట్లు చెబుతుంది. తన సొంత అపార్ట్మెంట్ అని అబద్ధం చెప్పి ఆమెకు ఒక స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తాడు అన్వేష్. కానీ అన్వేష్‌కు చెప్పకుండా మైథిలి ఆ అపార్ట్మెంట్ నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమైంది? మైథిలి సూసైడ్ చేసుకుందంటూ అన్వేష్ భయపడటానికి కారణం ఏమిటి? అన్వేష్, అతని స్నేహితులను ఎస్ఐ నంజుడప్ప (ఉపేంద్ర లిమాయే) ఎందుకు టార్గెట్ చేశాడు? మైథిలిని అన్వేష్ తిరిగి కలిశాడా? స్నేహితుల వల్ల అన్వేష్ ప్రేమకథ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది? అన్నదే ఈ సినిమా అసలు కథ.
ఎలా ఉందంటే:
ప్రస్తుతం టాలీవుడ్లో ఇతర జోనర్లతో పోలిస్తే కామెడీ చిత్రాల విజయాల శాతమే ఎక్కువగా ఉంది. కథ ఏదైనా దానికి కామెడీని జోడించి చెప్పడం ట్రెండ్‌గా మారింది. ‘రోమాంచకం’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. ‘ప్రేమ.. ఉత్కంఠ.. హాస్యం’ అంటూ మేకర్స్ టైటిల్‌కు తగిన క్యాప్షన్‌ను జోడించారు. ఈ మూడు ప్రధానాంశాల చుట్టూనే కథ సాగుతుంది. జెన్-జీ (Gen-Z) ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా దర్శకుడు ఈ కథను రాసుకున్నారు. కెరీర్, ప్రేమ విషయాలలో యువతలో ఉండే కన్ఫ్యూజన్ను ఆవిష్కరిస్తూ కథ చాలా సింపుల్‌గా సాగిపోతుంది. యూత్‌కు ఎలాంటి పెద్ద పెద్ద సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నించకుండా, సినిమా మొదటి నిమిషం నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా దర్శకుడు ముందుకు వెళ్లారు. ఈ విషయంలో ఆయన పూర్తిగా సఫలమయ్యారు. హీరో మరియు అతని స్నేహితుల మధ్య వచ్చే ప్రతి సన్నివేశం హిలేరియెస్గా నవ్విస్తుంది. పోలీస్ స్టేషన్ సీన్లు, హీరోయిన్ కనిపించకుండా పోయిందని హీరో ప్రెస్టేషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వేసే పంచ్‌లు, క్లైమాక్స్ పెళ్లి గోల చక్కగా ఎంటర్టైన్ చేస్తాయి. అయితే ఇందులో లాజిక్ల జోలికి వెళ్లకూడదు; అలాగే మైండ్‌కు పదును పెట్టే పెద్ద ట్విస్ట్‌లు కూడా ఆశించకుండా సరదాగా సినిమాను చూసేయవచ్చు.
తన స్నేహితులతో కలిసి స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. మొదటి సన్నివేశంతోనే హీరో మనస్తత్వాన్ని స్పష్టంగా చూపించారు. ఆ తర్వాత డేటింగ్ యాప్‌లో హీరోయిన్ పరిచయం, వారి లవ్ స్టోరీతో ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోతుంది. అన్వేష్‌ను కలవడానికి హైదరాబాద్ వచ్చిన మైథిలి కనిపించకుండా పోయే సన్నివేశంతో సినిమా ఒక్కసారిగా థ్రిల్లింగ్‌గా మారుతుంది. ఆమె సూసైడ్ చేసుకుందని హీరో, అతని స్నేహితులు భయపడటం, పోలీస్ ఆఫీసర్‌కు దొరక్కుండా మేనేజ్ చేసే ప్రయత్నంలో హీరో పడే పాట్లు నవ్విస్తూనే సస్పెన్స్‌ను కలుగజేస్తాయి. ప్రతి ప్రేమకథలాగే క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్లు కలవడం సాధారణంగానే రొటీన్ ఫార్మాట్లో ముగుస్తుంది. కథ కంటే కామెడీనే దర్శకుడు ఎక్కువగా నమ్ముకున్నాడు. లవ్‌స్టోరీ చాలా సాదాసీదాగా సాగుతుంది; హీరోహీరోయిన్లు కలవడానికి, విడిపోవడానికి పెద్దగా బలమైన కారణాలు కనిపించవు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చూపించే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు ఆ దిశగా ఎక్కువ దృష్టి పెట్టలేదు. ప్రారంభ సన్నివేశాలు కొంత నెమ్మదిగా సాగుతాయి.
నటీనటుల ప్రతిభ:
జెన్-జీ యువకుడి పాత్రలో సుమంత్ ప్రభాస్ సరిగ్గా సరిపోయాడు. అతని కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. అనంతిక సనీల్ కుమార్ తన సహజమైన నటనతో ఆకట్టుకున్నప్పటికీ, ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు; తన నటనలోని పూర్తి ప్రతిభను చూపించే అవకాశం ఆమెకు రాలేదు. హీరో ఫ్రెండ్‌గా నరేంద్ర రవి పాత్ర ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సినిమా బోర్ కొట్టే ప్రతిసారీ తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విించాడు. అతనితో పాటు వెంకటేష్ కాకుమాను, మణి ఎగుర్ల, సాయి సోహన్ కామెడీ బాగుంది. పోలీస్ ఆఫీసర్‌గా ఉపేంద్ర లిమాయే పాత్రను చాలా ఫన్నీగా మలిచారు. ఇక చివరిలో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ కేవీ గెస్ట్ రోల్లో మెరిసి నవ్వులు పంచారు.
సాంకేతిక వర్గం:
రొమాంటిక్ చిత్రానికి తగినట్లుగా వాసుకి వైభవ్ అందించిన సంగీతం బాగుంది. టైటిల్ సాంగ్‌తో పాటు మిగిలిన పాటలు ఆకట్టుకుంటాయి. ప్రత్యేకించి తెలంగాణ యాసలో వచ్చే డైలాగ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడిగా వేణుగోపాల్ రెడ్డికి ఇదే తొలి చిత్రమైనప్పటికీ, మంచి అనుభవజ్ఞుడిలా సినిమాను తెరకెక్కించారు. చిన్న సినిమా అయినప్పటికీ ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
చివరి మాట:
‘రోమాంచకం’ పూర్తిగా యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఒక మంచి టైమ్‌పాస్ ఎంటర్టైనర్. కథలోని లాజిక్లను పక్కనపెట్టి కేవలం వినోదం కోసం చూస్తే ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
రేటింగ్: 3/5