RGV | అక్కినేని అఖిల్ కెరీర్లో ఎంతోకాలంగా ఎదురుచూసిన సక్సెస్ ఎట్టకేలకు ‘లెనిన్’ సినిమాతో దక్కింది. విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా అఖిల్ నటనపై అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అక్కినేని కుటుంబంలోనే అఖిల్ అత్యుత్తమ నటుడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.’లెనిన్’ సినిమా విడుదలైన వెంటనే ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా అఖిల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. “హే అఖిల్ అక్కినేని… ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నందుకు బిగ్ కంగ్రాట్స్” అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దీనికి స్పందించిన అఖిల్.. “థ్యాంక్యూ సార్… ప్లీజ్ సినిమా చూడండి” అంటూ మర్యాదపూర్వకంగా రిప్లై ఇచ్చాడు. ఈ సంభాషణ అభిమానులను ఆకట్టుకోగా, తాజాగా సినిమా చూసిన తర్వాత ఆర్జీవీ చేసిన రివ్యూ మరింత వైరల్ అవుతోంది. సినిమా చూసిన అనంతరం రామ్ గోపాల్ వర్మ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. హే అఖిల్ అక్కినేని… ఇప్పుడే ‘లెనిన్’ సినిమా చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. అంతకంటే ముఖ్యంగా నువ్వు అక్కినేని కుటుంబంలోనే బెస్ట్ యాక్టర్ అని నేను రియలైజ్ అయ్యాను. ఇది నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశారు. సాధారణ భావోద్వేగాలు లేని సన్నివేశాల్లో కూడా అఖిల్ నటనలో కనిపించిన సహజత్వం తనను ఆశ్చర్యపరిచిందని, ఎమోషనల్ సీన్స్‌లో అయితే అఖిల్ అద్భుతంగా నటించాడని కొనియాడారు.
అంతేకాదు, అఖిల్‌లోని నటుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరికి కూడా ఆర్జీవీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాంటి అద్భుతమైన పాత్రను అఖిల్‌కు ఇచ్చిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరి అభినందనీయుడుఅంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో దర్శకుడిపై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. అఖిల్ కెరీర్ ప్రారంభం నుంచి వరుసగా ఎన్నో అంచనాలు, నిరాశలు ఎదుర్కొన్నాడు. సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూసిన ఆయనకు ‘లెనిన్’ సినిమా ఆ కలను నిజం చేసింది. కేవలం బాక్సాఫీస్ విజయమే కాకుండా నటుడిగా తనను తాను నిరూపించుకునే అవకాశం కూడా ఈ చిత్రం కల్పించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.