ProductionNo4 | భయానికి సరికొత్త అర్థాన్ని పరిచయం చేస్తూ, వెన్నులో వణుకు పుట్టించే ఒక డార్క్ అండ్ డేంజరస్ హారర్ థ్రిల్లర్ వెండితెరపైకి రాబోతోంది. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే హారర్, మిస్టరీ అంశాలతో కూడిన ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 మీడియా మరియు మహా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహర్షి కూండ్ల సమర్పణలో, మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ‘ప్రొడక్షన్ నెం. 4’గా షూటింగ్‌కు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ‘ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా, నిజ జీవితంలో జరిగిన కొన్ని భయానక ఘటనల ఆధారంగా తెరకెక్కుతుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా చిత్ర బృందం క్రేజీ అప్డేట్ను అందించింది. ఈ పోస్టర్లో కనిపిస్తున్న గాఢమైన చీకట్లు, భయంకరమైన చిహ్నాలు మరియు మిస్టీరియస్ ఎలిమెంట్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ రావడం ఖాయమనిపిస్తోంది. సూర్యాస్ ఈ చిత్రానికి కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో ఆస్కార్ విజేత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ భాగం కావడం సినిమా స్థాయిని పెంచడమే కాకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అచ్చు రాజమణి ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చుతుండగా, మిర్లాన్ నసీర్ సినిమాటోగ్రఫీ మరియు వంశీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ రేపు అధికారిక టైటిల్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించి ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను పెంచింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో, వెండితెరపై ఒక దృశ్య కావ్యంలా ఈ హారర్ థ్రిల్లర్‌ను తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం కృషి చేస్తోంది. జీకే మీడియా (గణేష్ – కుమార్) ఈ చిత్రానికి పిఆర్ఓగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఏమిటి? అసలు ఈ కథ వెనుక ఉన్న ఆ యదార్థ సంఘటనలేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Production 04