Reba Monica John | సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రెబా మోనికా జాన్ ఇంట త్వరలో సందడి వాతావరణం నెలకొననుంది. తాను గర్భవతి అనే శుభవార్తను ఆమె ఎంతో ఆనందంతో, భావోద్వేగంతో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్టు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి. రెబా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ “ముగ్గురిగా ఎదుగుతున్నాం… హల్లెలూయ” అంటూ హృదయాన్ని హత్తుకునే సందేశాన్ని పెట్టింది. దేవుడు ఇచ్చిన ఈ అమూల్యమైన వరానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ ప్రత్యేకమైన ప్రయాణంలో అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలని కూడా కోరుకుంది.
ఈ సందర్భంగా ఆమె తన భర్త జోమోన్ జోసెఫ్తో కలిసి తీసుకున్న అందమైన క్షణాలను ఫొటోల రూపంలో పంచుకుంది. ఆ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటూ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ జంట జీవితంలోకి కొత్త అతిథి రాబోతుండటంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె పోస్టును చూసిన సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వర్ష బొల్లమ్మ, అపర్ణా బాలమురళీ, ప్రియాంక జవాల్కర్ తదితరులు అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానులు కూడా రెబాకు ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు.
రెబా సినీ ప్రయాణం విషయానికి వస్తే.. మలయాళ సినిమాలతో కెరీర్ ప్రారంభించి, తరువాత తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. అలాగే ‘సామజవరగమన’, ‘మృత్యుంజయ్’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ చిత్రాల్లో శ్రీ విష్ణు సరసన ఆమె నటించి మెప్పించింది. ప్రస్తుతం రెబా గర్భవతి అనే వార్త సినీ వర్గాల్లో, అభిమానుల్లో హర్షం నింపుతోంది. ఆమె జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతున్న ఈ సమయంలో అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.