అగ్ర హీరో రవితేజ నటిస్తున్న ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా పానిండియా స్థాయిలో విడుదల కానున్నది. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు. అంకితభావం గల మధ్యతరగతి తండ్రిగా ఈ సినిమాలో రవితేజ కనిపిస్తారని, ఆయన నటన ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, భక్తి, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల మేళవింపుగా రానున్న ఈ చిత్రం అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.
దర్శకుడు శివ నిర్వాణ రాసిన ఈ కథ మానవసంబంధాలు, కుటుంబ విలువల నేపథ్యంలో సాగుతుందని, వాణిజ్య అంశాలు కూడా బలంగానే ఉంటాయని చిత్రబృందం చెబుతున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రియ భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తున్నది. సాయికుమార్, అజయ్‌ఘోష్, రమేశ్ ఇందిర, స్వాసిక ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్.