శరీరాకృతిని కించపరిచే బాడీ షేమింగ్‌కు తాను కూడా గురయ్యానని చెప్పుకుంది బాలీవుడ్ నటి రవీనా టాండన్. 90 దశకంలో స్టార్ హీరోయిన్గా వెలిగిన ఈ తార..ఇటీవల ‘కేజీఎఫ్ 2’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమెకు ఓటీటీ వేదికలతో పాటు పలు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవీనా టాండన్ మాట్లాడుతూ…‘అప్పట్లో ప్రతి సెలబ్రిటీకి వారి ఆకృతిని బట్టి ఒక పేరు పెట్టేవారు. నన్ను థండర్ థైస్ అని వర్ణిస్తూ న్యూస్ రాసేవారు.
సినిమా మేగజైన్స్ మా మీద అసత్య ప్రచారాలు ఎన్నో చేసేవి. బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ మేగజైన్స్‌కు మహిళలే ఎడిటర్స్‌గా ఉండేవారు. వాళ్లు హీరోలను బాగా అభిమానించేవారు. ఎవరైనా హీరో ఫలానా నాయిక మీద వ్యతిరేకంగా వ్యాసాలు రాయాలని చెబితే ఆ మాటే వేదంగా పాటించేవారు. ఎవరైనా హీరోయిన్ ఎదురుతిరిగితే పేజీ కింద క్షమాపణ పేరుతో సవరణ వేసేవారు. అప్పటికే ఆ నాయిక గురించి చెడు ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయేది. అలా ప్రచారం చేసిన మహిళలే ఇవాళ వుమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. నా మీద కూడా బాడీ షేమింగ్ వార్తలొచ్చాయి. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల నేను బొద్దుగా కనిపించేదాన్ని. పెండ్లయ్యాక సినిమాల నుంచి విరామం తీసుకున్నా. అప్పుడు, ఇప్పుడూ నా శరీరాకృతి పట్ల సంతృప్తిగా ఉన్నాను’ అని చెప్పింది.