Cinema News | రష్మికను అందరూ ‘నేషనల్ క్రష్’ అని ముద్దుగా పిలుస్తుంటారు. దానికి తగ్గట్టే పుష్ప, యానిమల్ సినిమాలతో జాతీయస్థాయిలో యువతరం కలలరాణిగా అవతరించింది రష్మిక. ఇప్పటివరకూ హీరోల పక్కన జతకట్టి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ అందం.. తొలిసారి లేడీఓరియెంటెడ్ సినిమాలో తళుక్కున మెరవనుంది. అన్నీ తానే అయ్యి సినిమాను భుజాలపై మోయడానికి రెడీ అయిపోయింది. ఆ సినిమానే ‘ది గర్ల్ ఫ్రెండ్’. మాస్ మూవీమేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ప్రతిష్టాత్మక గీతాఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. రష్మికకు, సినిమా టీమ్‌కు సమర్పకులైన అల్లు అరవింద్ దీవెనలందించారు. నిరవధికంగా 20రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్లో రష్మికతోపాటు కీలక నటీనటులందరూ పాల్గొంటారు. ఇదో వైవిధ్యమైన ప్రేమకథ అని, ఒక సూపర్‌హిట్ సినిమాకు పనిచేస్తున్నామనే పాజిటీవ్ ఫీలింగ్, కాన్ఫిడెన్స్‌తో షూటింగ్ మొదలుపెట్టామని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణవసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్.