Rao Bahadur | సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు నిర్మాతగా కూడా మహేష్ బాబు వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. తన సొంత బ్యానర్ GMB ఎంటర్టైన్మెంట్స్పై తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రావు బహదూర్’ ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వెకంటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మొదట ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌ను మార్చుతూ కొత్త తేదీని అధికారికంగా వెల్లడించారు.
ఇప్పుడు ‘రావు బహదూర్’ సినిమాను జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. “కొత్త డేట్.. ఒక మరువలేని అనుభవం” అంటూ విడుదల చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “అనుమానం పెనుభూతం” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన కొత్త పోస్టర్లలో సత్యదేవ్ పూర్తి భిన్నమైన లుక్‌లో కనిపించారు.ఈ పోస్టర్లలో సత్యదేవ్ వయసు పైబడిన వ్యక్తిగా, ఒంటినిండా ముత్యాల ఆభరణాలతో, రాయల్ స్టైల్లో కనిపించడం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన గెటప్, బ్యాక్‌డ్రాప్, పోస్టర్ డిజైన్ చూస్తుంటే సినిమా మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండొచ్చనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. వెంకటేష్ మహా తన సినిమాల్లో ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. దీంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమా వాయిదా వెనుక మరో ఆసక్తికర కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానుంది. అదే సమయంలో బాక్సాఫీస్ పోటీని నివారించేందుకు ‘రావు బహదూర్’ చిత్రాన్ని నాలుగు వారాలు వెనక్కి తీసుకెళ్లినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. GMB ఎంటర్టైన్మెంట్స్తో పాటు ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలోనే టీజర్ మరియు ట్రైలర్‌పై కూడా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సత్యదేవ్ కెరీర్లో ఇది మరో డిఫరెంట్ మూవీగా నిలుస్తుందనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.