Ranabali | టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సీ డ్రైవర్’, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ఆసక్తిని పెంచగా.. తాజాగా విడుదలైన టీజర్ మాత్రం అంచనాలను మరింతగా పెంచేసింది. ‘రణబాలి’ టీజర్‌ను గమనిస్తే.. చరిత్ర పుటల్లో పెద్దగా ప్రస్తావనకు రాని ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్రిటిష్ పాలన సమయంలో భారతీయులు ఎదుర్కొన్న అణచివేత, బాధలు, పోరాటాలను దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ చాలా హార్డ్ హిట్టింగ్‌గా చూపించినట్లు టీజర్‌తో అర్థమవుతోంది.
సాధారణంగా స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో వచ్చే సినిమాలకు భిన్నంగా.. ఇందులో కథను మరింత రా అండ్ ఇంటెన్స్‌గా ప్రజెంట్ చేసినట్లు కనిపిస్తోంది. టీజర్లో కనిపించే వాతావరణం, పాత్రల డిజైన్, భారీ సెట్స్, యాక్షన్ బ్లాక్స్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టేలా ఉన్నాయి. టీజర్లో విలన్ పాత్రను కూడా అత్యంత క్రూరంగా, పవర్‌ఫుల్‌గా చూపించినట్లు కనిపిస్తోంది. హీరోకు ఎదురుగా నిలిచే ప్రధాన ప్రతినాయకుడిని సాలిడ్‌గా ఎస్టాబ్లిష్ చేస్తూ.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ పాత్రను ఎలివేట్ చేసిన విధానం టీజర్లో హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా విజయ్ ఎంట్రీ నుంచి వచ్చే సన్నివేశాలు అభిమానులకు ఫుల్ మీల్స్ అందించేలా ఉన్నాయి. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్‌లో ఇప్పటివరకు చూడని కొత్త షేడ్స్‌లో విజయ్ కనిపించాడు.
విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఇది మరో డిఫరెంట్ పాత్రగా నిలిచే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. టీజర్లో ఆయన లుక్, నడక, చూపులు, డైలాగ్ చెప్పే విధానం చూస్తే.. నటుడిగా విజయ్ తనను తాను మరోసారి కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా పాత్రలోకి పూర్తిగా లీనమైన తీరు ఆకట్టుకుంటోంది. కొన్ని సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ అనే స్టార్ కనిపించకుండా.. కేవలం ‘రణబాలి’ అనే పాత్ర మాత్రమే కనిపించేలా పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు టీజర్ సూచిస్తోంది. ఈ సినిమాపై విజయ్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా మారింది. ‘రణబాలి’ టీజర్లో మరో ప్రధాన ఆకర్షణ సినిమా విజువల్స్. బ్రిటిష్ కాలం నాటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడానికి భారీ సెట్స్‌తో పాటు సినిమాటిక్ ఫ్రేమింగ్‌ను ఉపయోగించినట్లు కనిపిస్తోంది. కెమెరా వర్క్ కూడా టీజర్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ వాతావరణం, పాత్రల ఎమోషన్స్‌ను కెమెరాలో క్యాప్చర్ చేసిన విధానం సినిమాపై అంచనాలను పెంచుతోంది. పెద్ద స్క్రీన్‌పై ఈ విజువల్స్ మరింత అద్భుతంగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీజర్లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ఉన్న ఇంటెన్సిటీని మరింత పెంచేలా ఉంది. యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అంశాలకు తగ్గట్టుగా సంగీతాన్ని డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. టీజర్‌ను చూస్తున్నంతసేపు ప్రేక్షకుడిని కథలోకి లాగేసేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనిచేసింది. కొంతకాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు ‘రణబాలి’ ఒక కీలకమైన సినిమా. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ లాంటి విభిన్నమైన కథలను తెరకెక్కించే దర్శకుడు ఉండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.