Peddi Reloaded | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పుడు సరికొత్త ‘రీలోడెడ్ వెర్షన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల అదనపు దృశ్యాలను జోడించి నేటి నుంచి థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ కొత్త ఫుటేజ్‌లో కథానాయిక జాన్వీ కపూర్‌కు సంబంధించిన ఎమోషనల్ సీన్స్‌తో పాటు, సీనియర్ నటుడు జగపతి బాబు నటించిన కీలకమైన సన్నివేశం కూడా ఉండటం విశేషం. ఈ అదనపు ఐదున్నర నిమిషాల సీన్స్ సినిమా ఎమోషన్‌ను, డ్రామాను మరో స్థాయికి తీసుకెళ్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్న ‘పెద్ది’కి ఈ రీలోడెడ్ వెర్షన్ మరింత బూస్ట్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి పాన్ ఇండియా తారాగణం కీలక పాత్రల్లో మెరిశారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పటికే మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ‘పెద్ది’.. కొత్త సీన్ల జోడింపుతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందా అనేది ఆసక్తిగా మారింది. థియేటర్లలో ‘పెద్ది’ రీలోడెడ్ వెర్షన్‌ను మిస్ అవ్వొద్దని చిత్రయూనిట్ మెగా ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చింది.